మూసివేత‌ దిశ‌గా గ‌చ్చిబౌలి టిమ్స్‌!

గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ద‌వాఖాన మూత‌ప‌డ‌బోతున్న‌దా? ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఈ అనుమానాల‌కు ఊత‌మిస్తున్నాయి

మూసివేత‌ దిశ‌గా గ‌చ్చిబౌలి టిమ్స్‌!
  • ఇక్క‌డి సిబ్బందికి డిప్యూటేష‌న్‌
  • ఇత‌ర ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లింపు
  • గాంధీ, ఉస్మానియా, నిలోఫ‌ర్‌,
  • ఫీవ‌ర్ హాస్పిళ్ల‌లో స‌ర్దుబాటు!
  • సీటీ స్కాన‌ర్ నిజామాబాద్‌కు!
  • టీహ‌బ్‌కు వెళ్లిన ల్యాబ్ ప‌రిక‌రాలు?
  • శాశ్వ‌తంగా మూసివేస్తారా?
  • ద‌వాఖాన‌ అప్‌గ్రేడ్ కోస‌మా?
  • వ‌ర్క్ ఫ‌ర్ ఆర్డ‌ర్‌తో స్టాఫ్‌ ఆందోళ‌న‌
  • క‌రోనా వేళ విశేష సేవ చేసిన టిమ్స్‌

విధాత, ఉమ్మ‌డి రంగారెడ్డి : గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ద‌వాఖాన మూత‌ప‌డ‌బోతున్న‌దా? ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఈ అనుమానాల‌కు ఊత‌మిస్తున్నాయి. ఇక్క‌డ ప‌నిచేస్తున్న సిబ్బందిని ఇత‌ర హాస్పిట‌ళ్ల‌కు డిప్యూటేష‌న్‌పై పంపిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఉస్మానియా ద‌వాఖాన‌కు అనుబంధంగా గ‌చ్చిబౌలి టిమ్స్ కొన‌సాగుతుంద‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. ఇప్ప‌డు దాని ఉసురు తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ పేరిట దీనిని నెల‌కొల్పారు. క‌రోనా స‌మ‌యంలో అనేకమందికి ఈ ద‌వాఖాన సేవ‌లందించింది. రిక్రూట్‌మెంట్ చేప‌ట్టిన ప్ర‌భుత్వం.. 650 మంది సిబ్బందిని నియ‌మించింది. అయితే.. గ‌త కొద్దిరోజులుగా వీరిని న‌గ‌రంలోని ఇత‌ర ద‌వాఖాన‌ల‌కు వ‌ర్క్ ఫ‌ర్ ఆర్డ‌ర్ పేరిట డిప్యూటేష‌న్‌పై త‌ర‌లిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక్క‌డ మొత్తం 1200 పడకలు ఉన్నాయి. ఓపీ విభాగం మాత్ర‌మే కాకుండా.. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ను కూడా ఇక్క‌డ ఏర్పాటు చేసి ఉంటే.. మ‌రిన్ని సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చి ఉండేవ‌ని అంటున్నారు. ఇక్క‌డి 650 మంది సిబ్బందిలో 148 మంది ఔట్‌సోర్సింగ్ కింద‌, 502 మంది డాక్ట‌ర్లు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తున్నారు. వారిని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రితో పాటు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజీకి డిప్యూటేష‌న్ వేశార‌ని స‌మాచారం. ఇక ఇక్కడ మిగిలింది 10 నుంచి 15 మంది ఉండగా.. ఇందులో ముగ్గురు స్టాఫ్ నర్స్, ఇద్ద‌రు ల్యాబ్ టెక్నిషియన్లు, ఒక్కొక్కరు చొప్పున ఈసీజీ, రేడియాలజీ టెక్నీషియన్లు, మరో న‌లుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, మిగతా సిబ్బంది ఉన్నారు. గ‌చ్చిబౌలి టిమ్స్‌ను స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన ద‌వాఖాన‌గా ప్ర‌భుత్వం గ‌తంలో ప్ర‌క‌టించింది. సిబ్బందిని ఇత‌ర ద‌వాఖాన‌ల్లో స‌ర్దుబాటు చేస్తున్న నేప‌థ్యంలో నిజంగానే మూసివేస్తారా? లేక అప్‌గ్రేడ్ చేస్తారా? అన్న‌ది అర్థం కావ‌డం లేద‌ని సిబ్బంది చెబుతున్నారు.

అసెంబ్లీ లో చర్చ..

ఆగ‌స్ట్ 5న అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు -2023ను తీసుకొచ్చారు. జిల్లా ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందిన త‌ర్వాత మెరుగైన వైద్యం కోసం నిమ్స్ లేదా ఏదైనా ప్రైవేటు ద‌వాఖాన‌కు వెళ్లాల్సి వ‌స్తున్న‌ద‌ని, దీనిని ఆలోచించిన ముఖ్య‌మంత్రి.. హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేయాలని, మొత్తంగా రాష్ట్రంలో 10వేల సూప‌ర్ స్పెషాల్టీ పడ‌కలను అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించార‌ని చెప్పారు. నిమ్స్, ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌ను కూడా స్వయం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌లుగా చేయ‌డం ద్వారా మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ‌గా టిమ్స్ కూడా ప్ర‌జ‌ల‌కు ఆధునిక వైద్యాన్ని, వైద్య విద్యార్థుల‌కు మెరుగైన శిక్ష‌ణ‌ను అందిస్తుంద‌ని చెప్పారు. కానీ.. తాజా ప‌రిణామాలు ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నార్థకం చేస్తున్నాయి.

సీటీ స్కాన్ నిజామాబాద్‌కు త‌ర‌లింపు?

గచ్చిబౌలి టిమ్స్‌లో ఉన్న సీటీ స్కాన్ సామ‌గ్రిని నిజామాబాద్‌కు త‌ర‌లిస్తున్నార‌ని స‌మాచారం. ల్యాబ్‌కు సంబంధించిన ప‌రిక‌రాల‌ను కొండాపూర్‌లోని టీ-హ‌బ్‌కు త‌ర‌లించార‌ని తెలుస్తున్న‌ది. ఫర్నిచర్, వెంటిలెటర్స్‌ను కూడా ఇత‌ర ప్రాంతాల్లోని ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. టిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ విమల థామస్‌ను సిద్దిపేట మెడికల్ కాలేజీకి డిప్యూటేషన్‌పై పంపిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇలా ఏర్ప‌డింది..

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (టిమ్స్‌)ను కరోనా స‌మ‌యంలో బాధితులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం నెల‌కొల్పింది. దీనిని ఉస్మానియా ద‌వాఖాన‌కు అనుబంధంగా పేర్కొన్న‌ది. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1,500 పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు. క‌రోనా స‌మ‌యంలో నానాటికీ పెరిగిన బాధితుల సంఖ్య రీత్యా అతి త‌క్కువ స‌మ‌యంలోనే టిమ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 50 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేశారు. 10 వెంటిలేటర్లు, 3 ఈసీజీ యంత్రాల, 25 బీజీ ఆపరేటర్లు, ఒక ఎక్స్‌రే యంత్రాన్ని అందుబాటులో ఉంచారు. 10 అంతస్తుల్లో మొత్తం 1500 పడకలను సిద్ధం చేశారు.

ప్రతి అంతస్తులో రెండు నర్సింగ్‌ స్టేషన్లు, రోగి వివరాలు నమోదుకు కౌంటర్లు, పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ పనులు పూర్తయ్యాయి. ఫైర్‌ సేఫ్టీ ఉన్న ఈ భవనంలో పూర్తిగా సెంట్రల్‌ ఏసీ అందుబాటులో ఉంది. నిత్యం 1500 మందికి ఐపీ సేవలు, నిత్యం 2 వేల మందికి ఓపీ సేవలు అందించేందుకు ఇక్క‌డ అవ‌కాశం ఉన్న‌ది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత కూడా ఇది కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఆ విధంగా సాధార‌ణ వైద్య సేవ‌లు అందించేందుకు వీలుగా మార్పులు చేశారు. భ‌విష్య‌త్తులో ఇది మ‌ల్టీ స్పెషాల్టీ హాస్పిట‌ల్‌గా, పీజీ వైద్య విద్యా కేంద్రంగా మారుతుంద‌ని గ‌తంలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రి తాజా ప‌రిణామాల‌తో దీని భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందోన‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.