స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం

తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం

విధాత: తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. నేడు గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం అధికారిక ప్రకటన చేయనున్నారు. బుధవారం ఉదయం శాసనసభ కార్యదర్శికి ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన నామినేషన్ల పత్రాలపై సీఎం రేవంత్‌రెడ్డి సహా ప్రతిపక్ష బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కూడా సంతకం చేశారు.


శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆ పార్టీ తరుపున సహకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.


సమీకరణలతోనే ప్రసాద్‌కు సభా సారధ్యం


తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొంత మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక సమీకరణల కోణంలో పద్మశాలి సామాజిక వర్గంకు చెందిన గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా ఎంపిక చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ 1964లో తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం, బెల్కటూరు గ్రామంలో పాల ఎల్లమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించారు. ఆయన తాండూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.


ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


2012-14వరకు ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత & జౌళి, స్పిన్నింగ్ మిల్లులు & చిన్న తరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2012 ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార సమన్వయకర్తగా నియమించబడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి బీ.సంజీవరావు చేతిలో, 2018 ఎన్నికల్లోనూ బీఆరెస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ చేతిలో ఓడిపోయారు.


అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ పార్టీకి చెందిన మెతుకు ఆనంద్‌పై గడ్డం ప్రసాద్ కుమార్ విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయగా, డిసెంబర్ 13న నామినేషన్‌ దాఖలు చేశారు.


బీఆరెస్‌, సీపీఐలు ఆయనకు మద్దతు తెలుపడంతో పాటు మరెవరు పోటీగా నామినేషన్ వేయకపోవడంతో స్పీకర్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ రాష్ట్రం తొలి శాసన సభ స్పీకర్‌గా బీసీ సామాజికవర్గంకు చెందిన మధుసూధనచారి, రెండవ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికవ్వగా, మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు.