ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్రలు చేస్తున్న మోదీ

దేశంలో ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్రలను ప్రధాని మోదీ చేస్తున్నారని, కేసీఆర్‌ను లొంగతీసుకునేందుకే ఆయన కూతురు కవితను అరెస్టు చేయించారని బీఆరెస్ నేతలు

ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్రలు చేస్తున్న మోదీ

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌..మాజీ విప్ గొంగిడి సునీత

విధాత : దేశంలో ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్రలను ప్రధాని మోదీ చేస్తున్నారని, కేసీఆర్‌ను లొంగతీసుకునేందుకే ఆయన కూతురు కవితను అరెస్టు చేయించారని బీఆరెస్ నేతలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం మోదీకి అలవాటుగా మారిందని, మోదీ వచ్చే ముందు ఈడీ, సీబీఐ వస్తాయని విమర్శించారు.

వ్యతిరేకించిన వారిని ఇబ్బంది పెట్టడమే మోదీ నైజమని ఆరోపించారు. అవినీతి పరులంతా బీజేపీలో చేరగానే పవిత్రులైపోతున్నారని, ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యంమలో కవితది చిరస్మరణీయ స్థానమన్నారు. దేశాన్ని దోచుకున్నోళ్లకు చేయూతనిచ్చిందే మోదీ అని, మోదీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందన్నారు. కవితపై పెట్టిన కేసు మోదీ కేసు అని గొంగిడి సునీత విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.