మీకో దండంరా నాయనా.. కొత్త ఊరిని సృష్టించి ప్రభుత్వ డబ్బులు కాజేశారు

Punzab
విధాత: అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కవితకు కాదేదీ అనర్హం అని నాడు ఓ పెద్దమనిషి చెప్పాడు. దానినే ఆదర్శంగా తీసుకున్నారేమో కొంతమంది ప్రబుద్దులు ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలకు రాని విధంగా మనవాళ్లకు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తాయని నిరూపించారు. ఈ కొత్త రకం దోపిడి చేసి ప్రజలంతా ఔరా అని నోరెళ్లబెట్టేలా చేశారు. మన దేశంలో ప్రజలు ప్రభుత్వ పథకాలను సొంతం చేసుకోవడానికి చాలామంది ఫొటోలు మార్చడం, దొంగ పేపర్లు సృష్టించడం, టెంపరరీ సంబంధాలు ఏర్పాటు చేసుకోని లబ్ది పొందుతుంటారు. ఇప్పుడు మనం చదవబోయేది కూడా అలాంటిదే కానీ అంతకుమించి తెలివితో చేసి0ది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ (Punzab) రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌కు సమీపంలో `గట్టీ రాజో కి` (Gatti Rajo Ki) అని గ్రామ పంచాయితీనీ అధికారులు పేపర్ మీద సృష్టించారు. ఆ గ్రామం పేరుపై అనేక పేపర్లు రూపొందించారు. గ్రామ అభివృద్ధి కోసమని చెప్పి దఫా దఫాలుగా రూ.43 లక్షలు విడుదల చేసి కాజేశారు. గ్రామానికి 140 జాబ్ కార్డులను సైతం తయారు చేశారు. గ్రామంలో 55 అభివృద్ధి పనులు జరిగినట్టు పేపర్లు సైతం రెడీ చేసారు. ఆ ఊహా జనిత గ్రామంలో ఆర్మీ డ్యామ్, జంతువుల షెడ్, స్కూల్ పార్క్, రోడ్లు, ఇంటర్‌లాక్ టైల్స్ శుభ్రపరచడం మొదలైన పనులు చేసినట్టు పేపర్లపై చూపి మరి డబ్బులు కాజేశారు.
ఓ ఆర్టీఐ కార్యకర్త, బ్లాక్ కమిటీ సభ్యుడు గురుదేవ్ సింగ్ ఈ దొంగతన్నాని బయటపెట్టాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత కేవలం పేపర్ల మీద ఉన్న గ్రామం `గట్టీ రాజో కి` పంచాయతీకి సంబంధించిన సమాచారం అందిందని గురుదేవ్ తెలిపారు. ఈ కుంభకోణం గురించి పంచాయతీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. ఈ అంశంపై ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ దీప్శిఖా శర్మకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆ నివేదికను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొనే కార్యక్రమం ఇప్పుడు మొదలైనట్టు తెలుస్తోంది.