గురుకుల ప్రిన్సిపాల్స్ భర్తీ ఎప్పుడో!

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆరేళ్లుగా టీఎస్‌పీఎస్సీ జాప్యం నిరుద్యోగ అభ్యర్థులకు శాపంగా మారింది

గురుకుల ప్రిన్సిపాల్స్ భర్తీ ఎప్పుడో!
  • నియామకాల్లో టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం
  • ఆరేళ్లుగా అభ్యర్థుల న్యాయ పోరాటం
  • ఖాళీగా 118 ప్రిన్సిపల్‌ పోస్టులు
  • అందులో 102 పోస్టులు మహిళలవే
  • కోర్టు ఆదేశాలు సైతం బేఖాతర్‌



విధాత: తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆరేళ్లుగా టీఎస్‌పీఎస్సీ జాప్యం నిరుద్యోగ అభ్యర్థులకు శాపంగా మారింది. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న గురుకులాల ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసేలా చూడాలన్న విజ్ఞప్తి అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నది.


రాష్ట్రంలోని 304 గురుకుల ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీకి ప్రత్యక్ష నియామక పద్ధతిలో 2017 జూన్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలుగా పోస్టు గ్రాడ్యుయేట్‌, బీఈడీ విద్యార్హతతో పాటు పీజీటీ లేదా జేఎల్‌గా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఐదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నది.


ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఎగ్జామ్స్ పిదప 1124 మందితో షార్ట్ లిస్టు చేసి అందులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిదప 924 మందిని రిజెక్ట్ చేశారు. 350 మందిని 304 పోస్టులకు ఇంటర్యూకు పిలిచారు. అది కూడా 1:2 ప్రకారం పిలువకపోగా, నోటిఫికేషన్ మేరకు పీజీటీ లేనివాళ్లను కూడా ఇంటర్య్వూలకు పిలిచి నియామక ప్రక్రియ చేపట్టారని పలువురు నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఖాళీగా ఉన్న 304 పోస్టుల్లో 186 పోస్టులను భర్తీ చేయగా, 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మహిళలకు సంబంధించినవే 112 పోస్టులుండటం గమనార్హం.


ఉన్నత విద్యార్హతనే అడ్డంకి


టీఎస్‌పీఎస్సీ రిజెక్ట్ చేసిన అభ్యర్థుల్లో డిగ్రీ, బీఈడీ, డైట్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నత బోధన అనుభవం ఉన్నవారే కావడమే ఈ వ్యవహారంలో వివాదానికి కారణమైందని పలువురు చెబుతున్నారు. రాత పరీక్షలో 80-90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలిచ్చి, 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలువడంతో పాటు జేఎల్ కంటే అధికంగా డిగ్రీ, బీఈడీ, ఇంజనీరింగ్ కళాశాలల బోధనానుభవం ఉన్న వారిని ఉద్యోగాలకు దూరంగా పెట్టడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తూ బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.


డివిజన్ బెంచ్ బీఈడీ, డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన అభ్యర్థులు 24 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీని 2022 ఏప్రిల్‌లో కోర్టు ఆదేశించింది. పోస్టుల భర్తీ కోణంలో టీఎస్‌పీఎస్సీ విచక్షణాధికారంతో అభ్యర్థుల ఉన్నత విద్యాబోధానుభవాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఉన్నత విద్యాబోధన అనర్హత భావించరాదని కూడా పేర్కొన్నది.


కోర్టు ఆదేశాలు బేఖాతార్‌


ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీలో అభ్యర్థుల ఉన్నత విద్యా బోధన అనుభవాన్ని అనర్హతగా పరిగణించడం సరికాదని, వారికి ఉద్యోగాల భర్తీలో అవకాశం కల్పించాలని కోర్టు ఆదేశించినప్పటికి టీఎస్‌పీఎస్సీ మాత్రం వాటి అమలుకు చర్యలు తీసుకోలేదు. నోటిఫికేషన్ సందర్భంగా తాము పేర్కొన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ మేరకే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉన్నత విద్యాబోధనానుభవాన్ని పరిగణలోకి తీసుకోమంటూ వారికి ఉద్యోగాలివ్వడానికి నిరాకరిస్తూ వచ్చింది.


నిజానికి టీఎస్‌పీఎస్సీ చెప్పిన ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ తర్వాతా విడుదల చేయడం ఇక్కడ మరో వివాదాస్పద అంశంగా మారింది. నోటిఫికేషన్ జూన్‌లో విడుదలైతే ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రామాణికంగా భర్తీ చేస్తామన్న ప్రకటనను సెప్టెంబర్‌లో వెల్లడించింది. అదీగాక ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు గురుకులాల బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్ అనుమతిగానీ, ప్రభుత్వ ఆమోదం గానీ లేకపోగా, అలాంటి అనుమతులు లేకుండానే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం మరో చిక్కు ప్రశ్నగా తయారైంది.


కేవలం గురుకులాలు రూపొందించుకున్న చట్టబద్ధత లేని ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌నే ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రామాణికంగా తీసుకున్నదని పలువురు నిరుద్యోగులు చెబుతున్నారు. కోర్టు తన తీర్పులో అప్పటికే అమల్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్‌ రూల్స్ మేరకైనా వీళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పగా, తాము అలా చేయబోమని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారమే చేస్తామని టీఎస్‌పీఎస్సీ మొండికేసింది.


గురుకుల ప్రిన్సిపాల్స్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌, ఏఐసీటీ, ఎన్‌ఐసీటీ నామ్స్ ప్రకారం విద్యార్హతతో పాటు ఐదేళ్ల అనుభవం ఉంటే చాలు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పీజీటీ కేవలం కేంద్రీయ విద్యాలయాలు.. కేజీబీవీ, గురుకులాల్లో మాత్రమే ఉంటుండగా, జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో లేవు. అలాంటప్పుడు పీజీటీ నిబంధన ఎలా పెడుతారన్న అభ్యంతరం కూడా వ్యక్తమైంది.


అడ్డంకిగా మారిన అధికారిణి!


గురుకులాల ప్రిన్సిపాల్స్ పోస్టులో భర్తీలో కోర్టు ఆదేశాల బేఖాతర్‌కు టీఎస్‌పీఎస్సీలో ఉన్న అధికారిణి ఏకపక్ష వైఖరినే కారణమని బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాకుతో ఉన్నత విద్యా బోధన అర్హతను కాదని జేఎల్‌, పీజీటీలకు మాత్రమే ఉద్యోగ భర్తీలో అవకాశం కల్పించడంతో పాటు తెరవెనుక కక్కుర్తితో పీజీటీ లేని వారికి కూడా నియామకాల్లో సదరు అధికారిణి అవకాశం కల్పించారని ఆరోపణలు సైతం చేశారు.


ఈ నేపథ్యంలో తమకు సదరు అధికారిణితో న్యాయం జరుగదని భావించిన అభ్యర్థులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం చుట్టూ, మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సంబంధిత సమస్య అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ అదే అధికారిణి వద్దకే వస్తుండటంతో ఆమె తాను చేసిన నిర్వాకం బయటపడుతుందన్న ఉద్దేశంతదో ఉన్నత బోధనానుభవం, ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ సాకును చూపి ఉద్యోగ నియామకాలను నిరాకరిస్తూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


అధికారిణి వైఖరితో విసుగెత్తిన అభ్యర్థులు మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా, టీఎస్‌పీఎస్సీ వాదన అనంతరం కోర్టు మళ్లీ కొత్త రిట్ పిటిషన్ ద్వారా రావాలని అభ్యర్థులకు సూచించింది. దీంతో అభ్యర్థుల ఆరేళ్ల న్యాయ పోరాటం సైతం మళ్లీ మొదటికే వచ్చింది. ఈ ఆరేళ్లుగా 118 గురుకుల ప్రిన్సిపాల్స్‌ పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయి.


కొత్త ప్రభుత్వంపైనే ఆశలు


ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని గురుకుల ప్రిన్సిపాల్స్ పోస్టుల బాధిత అభ్యర్థులు కోరుతున్నారు. ఉన్నత విద్యా బోధనానుభవం తమ తప్పిదం కాదని, దాన్ని అనర్హతగా చూపి తమకు అన్యాయం చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు.


గత ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాన్ని కొత్త ప్రభుత్వం సరిదిద్దాలని వారు కోరుతున్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం ఏండ్ల తరబడిగా బోర్డులో తిష్ఠవేసి, తమ అక్రమాలు బయట పడకుండా వ్యవహారాలు సాగిస్తున్న అధికారులను తొలగించాలని, తమకు హేతుబద్ధత, మానవతా కోణంలో న్యాయం చేయాలని బాధిత అభ్యర్థులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.