Hachiko | య‌జ‌మాని కోసం ఎదురుచూస్తూ.. శిలగా మారిన శున‌కానికి వందేళ్లు

Hachiko | Dog బిజీ జీవితానికి మారుపేరైన టోక్యో (Tokyo) న‌గ‌రం.. గ‌త శ‌తాబ్దంలో మెలితిప్పే ఒక ఘ‌ట‌నకు వేదిక‌గా నిలిచింది. త‌న య‌జ‌మాని చ‌నిపోయాడ‌ని తెలియ‌ని ఒక పెంపుడు శున‌కం ప్ర‌తి రోజూ ఒక రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చి ఎదురు చూడ‌టం మొద‌ట జ‌పాన్‌ (Japan)ను, త‌ర్వాత ప్ర‌పంచాన్ని క‌దిలించింది. ఆ శున‌కం పేరు హ‌చీకో. ఈ ఏడాది దానికి 100వ పుట్టిన‌ రోజు కావ‌డంతో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా దాని అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ […]

  • By: krs    latest    Jul 03, 2023 6:27 AM IST
Hachiko | య‌జ‌మాని కోసం ఎదురుచూస్తూ.. శిలగా మారిన శున‌కానికి వందేళ్లు

Hachiko | Dog

బిజీ జీవితానికి మారుపేరైన టోక్యో (Tokyo) న‌గ‌రం.. గ‌త శ‌తాబ్దంలో మెలితిప్పే ఒక ఘ‌ట‌నకు వేదిక‌గా నిలిచింది. త‌న య‌జ‌మాని చ‌నిపోయాడ‌ని తెలియ‌ని ఒక పెంపుడు శున‌కం ప్ర‌తి రోజూ ఒక రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చి ఎదురు చూడ‌టం మొద‌ట జ‌పాన్‌ (Japan)ను, త‌ర్వాత ప్ర‌పంచాన్ని క‌దిలించింది. ఆ శున‌కం పేరు హ‌చీకో. ఈ ఏడాది దానికి 100వ పుట్టిన‌ రోజు కావ‌డంతో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా దాని అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా దాని క‌థ‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే..

అకితాస్ జాతికి చెందిన హ‌చీకో 1923 న‌వంబ‌రులో ఒడేట్ అనే న‌గ‌రంలో జ‌న్మించింది. ఈ జాతి శున‌కాల‌కు ఉన్న ధైర్యం, తెగువ‌, న‌మ్మ‌కం వ‌ల్ల జ‌పాన్ వాసులు వీటిని ఎక్కువ‌గా పెంచుకునే వారు. ఇక హ‌చీకో విష‌య‌నాకి వ‌స్తే.. 1924లో దీనిని అగ్రిక‌ల్చ‌ర్ ప్రొఫెస‌ర్ హిడెస్‌బ‌రో యునో కొనుక్కుని పెంచుకోడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే వీరిద్ద‌రి మ‌ధ్యా గాఢ‌మైన అనుబంధం అల్లుకుంది.

రోజు ఆయ‌న ప్ర‌యాణించే షిబుయా రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లి.. సాయంత్రం ఆయ‌న తిరిగొచ్చే వ‌ర‌కు అక్క‌డే ఉండేది. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ఇంటికి వ‌చ్చే వారు. 1924లో ఓ రోజు య‌థావిధిగా షిబుయా స్టేష‌న్‌లో రైలెక్కి వెళ్లిన ఆయ‌న.. మ‌ళ్లీ తిరిగి రాలేదు. బ్రెయిన్ హెమ‌రేజ్‌కు గురి కావడంతో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘ‌ట‌నతో గుండె బ‌ద్ద‌లైన హ‌చీకో (Hachiko) త‌న య‌జ‌మాని లేడ‌నే నిజాన్ని జీర్ణించుకోలేక‌ పోయింది. ఆ త‌ర్వాత అది కొద్దిరోజులు వేర్వేరు య‌జ‌మానుల ద‌గ్గ‌ర పెరిగింది. అనంత‌రం కొద్ది రోజుల‌కు షిబుయా రైల్వే స్టేష‌న్‌కే త‌న ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టింది. రోజూ త‌న య‌జమాని రైలు ఎక్కే స‌మ‌యం, దిగే స‌మ‌యాల్లో ఠంచ‌నుగా వ‌చ్చి ఎదురు చూసేది. రాక‌పోవ‌డంతో దిగాలుగా మొహం పెట్టుకుని తిరిగి వెళ్లిపోయేది.

ఈ నేప‌థ్యంలో ఈ కుక్కని ఒక స‌మ‌స్య‌గా భావించిన స్టేష‌న్ అధికారులు.. ఇది పాపుల‌ర్ కావ‌డంతో ఏమీ చేయ‌లేక‌ పోయారు. 1932 అక్టోబ‌రులో టోక్యోకు చెందిన అసాహీ షింబున్ అనే వార్తా ప‌త్రిక హ‌చీకోపై ఒక ఫీచ‌ర్‌ను ప్ర‌చురించింది. ఈ వార్త జ‌పాన్‌లో న‌లు చెరగులా పాకి వేల మంది ప్ర‌జ‌లు దానికి అభిమానులుగా మారిపోయారు. హ‌చీకోను చూడ‌టానికే కొంత మంది టోక్యోకు వ‌చ్చే వారంటే అతిశ‌యోక్తి కాదు.

అలా వ‌చ్చిన వాళ్లు ఆహారం పెట్ట‌డం, ద‌గ్గ‌ర‌కి తీసుకుని ఓదార్చ‌డం చేసే వారు. అలా అది మ‌ర‌ణించిన 1935 అక్టోబ‌రు 8 వ‌ర‌కు ఆ స్టేష‌న్‌లో ప్ర‌తిరోజూ ఎదురు చూసింది. న‌మ్మ‌కానికి, ప్రేమ‌కు ఒక గుర్తింపు తెచ్చిన హ‌చీకోను జ‌పాన్ వాసులు మ‌రిచిపోలేక‌ పోయారు. దీంతో 1948లో నిలువెత్తు కాంస్య విగ్ర‌హాన్ని ఆ స్టేష‌న్ బ‌య‌టే ఏర్పాటు చేశారు.

సినిమాలూ హిట్టే

హ‌చీకో క‌థ సినిమాగానూ తెర‌కెక్కి హిట్లు కొట్టాయి. తొలుత జ‌పాన్‌, త‌ర్వాత చైనాలో దీనిపై సినిమాలు తెర‌కెక్క‌గా..2009లో హాలీవుడ్‌లో తెర‌కెక్కించారు. ప్రపంచ‌వ్యాప్తంగా శున‌కాల విశ్వాసం, ప్రేమ‌పై ఇలాంటివి ఎన్నో గాథ‌లు ఉన్న‌ప్ప‌టికీ వాట‌న్నింటిక‌న్నా ముందు వ‌ర‌స‌లో నిలిచేది హ‌చీకో క‌థే. ఇది జ‌పాన్ వాళ్లు చెప్పే మాట కాదు.. శున‌క ప్రేమికులు అంద‌రూ చెప్ప మాటే. అయితే ఈ కథతోనే తెలుగులో రాజేంద్రప్రసాద్‌ హీరోగా ‘టామీ’ అనే సినిమా వచ్చింది.