Hawaii | హ‌వాయీ ద్వీపాన్ని ద‌హిస్తున్న కార్చిచ్చు.. బూడిద కుప్ప‌లా మారిన న‌గ‌రం: 36 మంది మృతి

Hawaii | ఈ భూమి మీద అత్యంత అంద‌మైన ప్ర‌దేశాల్లో ఒక‌టిగా చెప్పుకొనే హ‌వాయీ (Hawaii) ద్వీపాన్ని కార్చిచ్చు (Wild Fire) క‌మ్మేసింది. ఇక్క‌డి మావుయి ప్రాంతంలో ఈ మంట‌ల ధాటికి 36 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మందికి పైగా గాయ‌ప‌డ్డారు. లాహైయానా అనే న‌గ‌రం మొత్తం బూడిద‌లా మారిపోయింది. ఇక లాహైయానా న‌గరం ప్ర‌పంచ ప‌టం మీద నుంచి తుడిచి పెట్టుకుపోయిన‌ట్టేన‌ని హ‌వాయీ సెనేటర్ బ్రియాన్ స్కాట్జ్ వాపోయారు. ఇప్ప‌టికే వేల మంది ప్ర‌జ‌లను […]

  • By: krs    latest    Aug 10, 2023 12:10 PM IST
Hawaii | హ‌వాయీ ద్వీపాన్ని ద‌హిస్తున్న కార్చిచ్చు.. బూడిద కుప్ప‌లా మారిన న‌గ‌రం: 36 మంది మృతి

Hawaii |

ఈ భూమి మీద అత్యంత అంద‌మైన ప్ర‌దేశాల్లో ఒక‌టిగా చెప్పుకొనే హ‌వాయీ (Hawaii) ద్వీపాన్ని కార్చిచ్చు (Wild Fire) క‌మ్మేసింది. ఇక్క‌డి మావుయి ప్రాంతంలో ఈ మంట‌ల ధాటికి 36 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మందికి పైగా గాయ‌ప‌డ్డారు. లాహైయానా అనే న‌గ‌రం మొత్తం బూడిద‌లా మారిపోయింది.

ఇక లాహైయానా న‌గరం ప్ర‌పంచ ప‌టం మీద నుంచి తుడిచి పెట్టుకుపోయిన‌ట్టేన‌ని హ‌వాయీ సెనేటర్ బ్రియాన్ స్కాట్జ్ వాపోయారు. ఇప్ప‌టికే వేల మంది ప్ర‌జ‌లను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. మంట‌లు అడ‌వుల‌ను దాటి జ‌నావాసాల్లోకి కూడా రావ‌డంతో విద్యుత్‌, టెలిఫోన్ తీగ‌లు, సెల్‌ఫోన్ ట‌వ‌ర్లు అగ్నికి ఆహుత‌య్యాయి. దీంతో ఆయా సేవ‌లు పూర్తిగా స్తంభించిపోయాయి.

స‌మీప ప‌సిఫిక్ తీరంలో హ‌రికేన్ ఏర్ప‌డ‌టంతో దాని ప్ర‌భావం వ‌ల్ల భీక‌ర గాలులు వీస్తున్నాయి. ఇవి అప్ప‌టికే ఉన్న కార్చిచ్చుల‌కు తోడై విధ్వంసం జ‌రుగుతోంది. స‌ముద్ర తీరంలో నివ‌సిస్తున్న కొంత‌మంది ప్ర‌జ‌లు మంట‌ల‌కు భ‌య‌ప‌డి దారిలేక స‌ముద్రంలోకి దూకేశారు. వీరిని యూఎస్ కోస్ట్‌గార్డు కాపాడిన‌ట్టు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఎవ‌రైనా మంట‌ల‌కు భ‌య‌ ప‌డి కార్ల‌లో త‌ల‌దాచుకున్నారేమోన‌ని స‌హాయ‌క బృందాలు అణువ‌ణువూ జ‌ల్లెడ ప‌డుతున్నాయి. మృతుల సంఖ్య మ‌రింత పెర‌గ‌చ్చున‌ని అంచ‌నాలున్నాయి. అయితే ఈ కార్చిచ్చులు ఎలా మొద‌ల‌య్యాయ‌నే దానిపై అధికారుల వ‌ద్ద కూడా స‌మాధానం లేదు. తేమ త‌క్కువ‌గా ఉండ‌టం, భారీ గాలులు కార్చిచ్చుల‌కు అవ‌కాశం క‌ల్పించి ఉండొచ్చ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.