సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పెంపు..! ఎప్పటి వరకు అంటే..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది

విధాత: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్స్‌ను గరిష్ఠంగా 7.75శాతం వరకు కల్పిస్తున్నది. ఈ స్కీమ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ 2020 మేలో తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌కు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తుండడంతో గడువును పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఇకపై సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసేందుకు గడువు వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 10 వరకు ఉండనున్నది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పథకం కింద సీనియర్ సిటిజన్స్‌కు సాధారణంగా ఇచ్చే అదనపు వడ్డీపై మరో 0.25 శాతం వడ్డీ రేటు హెచ్‌డీఎఫ్‌సీ కల్పిస్తున్నది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు అదనంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కల్పిస్తుండగా.. మొత్తం 7.75శాతం వడ్డీని అందిస్తున్నది.
ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేటును మాత్రమే వర్తించనున్నది. ఐదేళ్ల ఎఫ్‌డీ అయితే వడ్డీ రేటు 7.50శాతం ఉంటుంది. ప్రత్యేక పథకంలో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లకు అత్యవసరంగా డబ్బులు అవసరమై ప్రీ మెచ్యూర్ చేయాలనుకుంటే నష్టపోవాల్సి వస్తుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన కాలం మొత్తానికి 1.25శాతం వడ్డీలో బ్యాంక్ కోత పెడుతుంది.
వడ్డీ రేట్లు ఇలా..
సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్‌పై 3.50శాతం వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తున్నది. 30 రోజుల నుంచి 45 రోజులకు 4శాతం.. 46 రోజుల నుంచి 89రోజుల వరకు 5శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. 90 రోజుల నుంచి ఆరు నెలలలోపు 5శాతం.. ఆరు నెలల ఒకరోజు నుంచి 9 నెలల వరకు 6.25 శాతం వడ్డీ, 9 నెలల ఒక రోజు నుంచి ఏడాదిలోపు 6.50 శాతం.. ఏడాది నుంచి 15 నెలల లోపు 7.10శాతం వడ్డీని చెల్లిస్తుంది.
కాగా.. 15 నెలల నుంచి 18 నెలలకు 7.60 శాతం.. 18 నుంచి 21 నెలలలోపు 7.50 శాతం వడ్డీ ఇస్తుండగా.. 21 నెలల నుంచి 2 ఏళ్ల వరకు 7.50శాతం, రెండుసంవత్సరాల ఒక రోజు నుంచి 2 ఏళ్ల 11 నెలల వరకు 7.50 శాతం వడ్డీ చెల్లించనున్నది. 2ఏళ్ల 11 నెలల నుంచి 35 నెలల వరకు 7.65 శాతం, 2 ఏళ్ల 11 నెలల ఒక రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల లోపు వరకు 7.50శాతం, 4 ఏళ్ల 7 నెలల ఒక రోజు నుంచి 5 ఏళ్ల లోపు 7.50 శాతం, 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై అత్యధికంగా 7.75 శాతం వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ చేస్తున్నది.