బండెనక బండి కట్టి.. హైవేలపై బారులు తీరిన ట్రాఫిక్‌

సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో పండగకు సొంతూళ్లకు వెళ్లే జనం రద్ధీతో బస్సులు, రైళ్లు కిక్కిరిపోగా, రహదారులు ట్రాఫిక్ రద్ధీతో వాహనాల బారులతో నిండిపోయాయి

బండెనక బండి కట్టి.. హైవేలపై బారులు తీరిన ట్రాఫిక్‌
  • పల్లెకు పోదాం…బారులు తీరగా..
  • హైవేలపై వాహనాల బారులు
  • ట్రాఫిక్ రద్ధీతో ఇక్కట్లు

విధాత : సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో పండగకు సొంతూళ్లకు వెళ్లే జనం రద్ధీతో బస్సులు, రైళ్లు కిక్కిరిపోగా, రహదారులు ట్రాఫిక్ రద్ధీతో వాహనాల బారులతో నిండిపోయాయి. తమ సొంత వాహనాల్లో పల్లె బాట పట్టిన ప్రజల కార్లతో హైదరాబాద్‌- విజయవాడ నేషనల్ హైవే 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం తెల్లవారుజాము నుంచి ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో పతంగి టోల్ ప్లాజా వద్ద 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ మొత్తం 16 టోల్ మార్గాలు ఉండగా.. విజయవాడ వైపుకు 12 తెరిచి వాహనాలను పంపిస్తున్నప్పటికి కిలోమీటర్ల కొద్ధి వాహనాల బారులు కనిపిస్తున్నాయి. హైదరాబాదు నుండి విజయవాడ వచ్చే వాహనాలను ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారికి పంపించడంతో అటు హైదరాబాదు రోడ్డు ఇటు విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో 5కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అటు ఇటు వెళ్లకుండా మధ్యలో వాహనాలు ఇరుక్కుపోగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అదనపు సిబ్బందిని నియమించినట్లుగా టోల్ ఫ్లాజా మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

పండుగ వేళ రోడ్డుపైకి వచ్చే వాహనాలను పోలీసులు, అధికారులు సరిగా అంచనా వేయలేక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. మరోపక్క నగరంలోని ప్రధాన బస్‌ స్టేషన్లు అన్ని జనంతో కిక్కిరిసిపోతున్నాయిజ‌ జేబీఎస్, ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్ బస్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడగా, సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సుల కోసం గంటల తరబడి నిలబడాల్సిరావడం..బస్సు ఎక్కాక అందులోనూ నిలబడాల్సి వస్తుండటంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు. అటు హైదరాబాద్-వరంగల్, అద్దంకి నార్కట్‌పల్లి సహా ఇతర జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద బారీగా వాహనాల రద్ధీ కొనసాగింది.