Tummala Nageswar Rao | ప్రజల కోసం పోటీ చేస్తా.. నేను ఎవరికీ తల వంచేది లేదు: తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటన

Tummala Nageswar Rao | గోదావరి జలాలతో మీ పాదాలు.. కడిగేందుకు మళ్లీ ఎమ్మెల్యేగా వస్తా  ఖమ్మం బీఆరెస్‌లో కీలక మలుపు విధాత : మాజీ మంత్రి, బీఆరెస్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు గళం వినిపించారు. పాలేరు టికెట్‌ను తనను కాదని సిటింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి కేటాయించడంతో భగ్గుమన్న తుమ్మల.. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తనను నమ్ముకున్న తన ప్రజల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన […]

  • By: krs    latest    Aug 25, 2023 4:07 PM IST
Tummala Nageswar Rao | ప్రజల కోసం పోటీ చేస్తా.. నేను ఎవరికీ తల వంచేది లేదు: తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటన

Tummala Nageswar Rao |

  • గోదావరి జలాలతో మీ పాదాలు.. కడిగేందుకు మళ్లీ ఎమ్మెల్యేగా వస్తా
  • ఖమ్మం బీఆరెస్‌లో కీలక మలుపు

విధాత : మాజీ మంత్రి, బీఆరెస్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు గళం వినిపించారు. పాలేరు టికెట్‌ను తనను కాదని సిటింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి కేటాయించడంతో భగ్గుమన్న తుమ్మల.. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తనను నమ్ముకున్న తన ప్రజల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం పాలేరులో జరిగిన తన అనుచరులు, అభిమానుల ఆత్మీయ సమావేశానికి హాజరైన తుమ్మల నాగేశ్వర్‌రావు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు.

ఈ గడ్డపై ఎంతోమంది మహానుభావులు పుట్టారని, వారందరికంటే తనకు ఎక్కువగా అవకాశం వచ్చిందని చెప్పారు. భద్రాచలం రాముడిచ్చిన శక్తితో జిల్లా అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు. ఎందరో నాయకుల వల్ల కాని అభివృద్ధిని తాను చేసి చూపించానన్నారు. కొందరు పరాన్నభుక్కులు తనను ఈ ఎన్నికల నుంచి తప్పించామని శునకానందం పొందుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

కానీ తాను ఎవరినీ నిందించదల్చుకోలేదన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా వస్తానని, గోదావరి నీళ్లతో మీ కాళ్లు కడిగాకే రాజకీయాల నుండి వెళ్లిపోతానని చెప్పారు. ‘మీతో శభాష్ అనిపించుకుంటానేకానీ.. ఎక్కడా ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. నా శిరస్సు నరుక్కుంటా తప్ప నా వల్ల ఎవరూ తలదించుకోవద్దు’ అని ఆవేశంగా అన్నారు. తనకు పదవి అలంకారం కోసమో అహంకారమో, ఆధిపత్యం కోసమో కాదన్నారు. నిజానికి తాను మీతో రాజకీయ బంధం తెంచుకుందామనుకున్నానని, కాని మీ అభిమానం చూసినా తర్వాతా రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

మీ బిడ్డగా పది నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నిర్ణయం మార్చుకున్నానన్నారు. తాను ఎన్నోసార్లు కిందపడ్డానని, అయినా రాజకీయంగా ఖమ్మం ప్రజలే తనను బతికించారని చెప్పారు. మీ కోసమే రాజకీయ జీవితం తప్ప, తనకు రాజకీయం అవసరం లేదన్నారు. ఈ జిల్లా ప్రజల కోసం, మీ ప్రతిష్ఠ కోసం, మీ ఆత్మాభిమానం కోసం, మీ ఆత్మగౌరం కోసం ఎన్నికల్లో నిలబడుతానన్నారు. పాలేరు, వైరా, లంకాసాగర్‌, బేతుపల్లి ప్రాజెక్టులలో గోదావరి నీళ్లు నింపి సెలవు తీసుకుంటానన్నారు. కాగా తుమ్మల తాను ఖచ్చితంగా పోటీ చేస్తానన్న ప్రకటనతో ఆయన ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు రేకెత్తాయి.

గత ఎన్నికల్లో బీఆరెస్ నుంచి పోటీ చేసిన తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి పై పోటీ చేసి ఓడారు. అనంతరం ఉపేందర్‌రెడ్డి బీఆరెస్‌లో చేరడంతో పాలేరు బీఆరెస్‌లో తుమ్మల, కందాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. తాజాగా సీఎం కేసీఆర్ బీఆరెస్ సిటింగ్ అభ్యర్థికే మళ్లీ టికెట్ ఇవ్వడం రాజకీయంగా తుమ్మలకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తుమ్మల తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం, హైదరాబాద్‌ నుంచి శుక్రవారం పాలేరుకు ర్యాలీగా బయలుదేరే క్రమంలో బీఆరెస్ జెండాలు లేకుండా వెళ్లడం వంటి అంశాలు ఆయన బీఆరెస్‌ను వీడుతారన్న అభిప్రాయాలకు బలం చేకూర్చాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

ఇప్పుడు తుమ్మల కూడా పార్టీ మారితే ఈ జిల్లాలో బీఆరెస్‌కు మరింత నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలే కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉన్న ఈ జిల్లాలో ఇప్పటికే పొత్తు బంధం తెగిపోయి వారు సైతం దూరమవ్వడం కూడా బీఆరెస్‌కు రాజకీయంగా దెబ్బనే. ఈ పరిస్థితుల్లో పొంగులేటి బాటలో తుమ్మల కూడా పార్టీ వీడితే బీఆరెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.