10న హైదరాబాద్ లో ఐఎల్ పీఏ జాతీయ సదస్సు
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్ పీఏ) మూడో జాతీయ సదస్సు ఈనెల 10న ఆదివారం హైదరాబాద్ లో జరగనుంది
- జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో వేదిక
- దేశం నలుమూలల నుంచి తరలిరానున్న న్యాయవాదులు
విధాత: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్ పీఏ) మూడో జాతీయ సదస్సు ఈనెల 10న ఆదివారం హైదరాబాద్ లో జరగనుంది. నగరంలోని మాసాబ్ ట్యాంక్ జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఆడిటోరియంలో వేదిక సిద్ధమైంది. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి న్యాయవాదులు తరలిరానున్నారు. ఈసందర్భంగా 3వ జాతీయ కన్వెన్షన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు ప్రకటన విడుదల చేస్తూ, న్యాయవాదులు సదస్సుకు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
న్యాయవాదుల సాధికారత, న్యాయ వ్యవస్థలో బహుజన సమాజానికి చెందిన న్యాయవాదుల న్యాయమైన వాటా సాధనకు ఐఎల్ పీఏ దేశవ్యాప్తంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానం వెలుగులో దేశ వ్యాప్తంగా న్యాయవాదులను సమీకరించి, బహుజనోద్యమానికి దన్నుగా నిలబడే ప్రయత్నం చేస్తున్న ఏకైక జాతీయ స్థాయి సంస్థ ఐఎల్ పీఏ అని అన్నారు. ఈ కృషిలో భాగంగానే హైదరాబాద్ లో తన 3వ జాతీయ మహాసభను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
అతిథులు వీరే..
ఐఎల్ పీఏ కార్యాచరణను మరింత విస్తరించుకుని బహజన న్యాయవాదులు, సమాజానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఈ జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్య మిస్తున్నదని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయవాదులు పెద్దఎత్తున, స్వచ్ఛందంగా ఈ మహాసభల్లో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ప్రారంభ, ముగింపు సమావేశాలే కాకుండా మధ్యలో మరో 4 సెషన్స్ ఉంటాయని పేర్కొన్నారు.
ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి, ఓబీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య, బామ్సెఫ్ జాతీయ అధ్యక్షులు వామన్ మేష్రాం, ఇతర అతిథులు సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, మోక సత్తిబాబు(ఐపీఎస్), తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యలు సునీల్ గౌడ్, జయకర్, చలకాని వెంకట్ యాదవ్, బీ కొండా రెడ్డి, జితేందర్ రెడ్డి, కర్ణాటక హైకోర్ట్ సీనియర్ న్యాయవాది, హక్కుల ఉద్యమ కారుడైన ఎస్ బాలక్రిష్ణన్ హాజరవుతున్నట్లు చెప్పారు.
రాజ్యాంగంపై మనువాదుల కుట్ర
ఐఎల్ పీఏ జాతీయ మహాసభల్లో భారత రాజ్యాంగంపై మనువాదుల కుట్ర, ఓబీసీ సమాజ కుల గణన జరగకుండా పాలక వర్గాలు చేస్తున్న కుట్రలపై, భారతీయ న్యాయసంహిత పేరున మనువాద పాలకులు క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని మనువాదీకరించడంపై, బహుజన ప్రజాస్వామిక ఉద్యమాలలో న్యాయవాదుల పాత్ర, న్యాయవాదుల రక్షణ చట్టం ఆవశ్యకతపై అతిథులు, మేధావులు, న్యాయవాదులు ప్రసంగిస్తారని తెలిపారు.
జాతీయ మహాసభకు దూర ప్రాంతాలనుండి వచ్చే న్యాయవాదులకు తగిన బస ఏర్పాట్లు, భోజన వసతులు కల్పించామన్నారు. బలమైన బహుజన న్యాయవాదుల ఉద్యమ నిర్మాణానికి, భారత రాజ్యాంగ రక్షణకు, రాజ్యాంగ లక్ష్యాల సాధనకు న్యాయవాదులు ఐఎల్ పీఏలో భాగస్వాములు కావాలని 3వ జాతీయ కన్వెన్షన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. నీలి విప్లవం కోసం న్యాయవాదులు దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనింపచేయాలని, బహుజన సమాజానికి మనమున్నామన్న భరోసా ఇస్తూ, బహుజనోద్యమాన్ని విజయవంతం చేద్దామని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram