Carbon Emissions | దేశాల క్రెడిట్ రేట్ల‌పై క‌ర్బ‌న ఉద్గారాల ప్ర‌భావం.. భార‌త్ స‌హా ప‌లుదేశాల‌కు హెచ్చ‌రిక‌

Carbon Emissions | ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌ వ‌ల్ల దేశ ఆర్థిక ప‌రిస్థితిపై ప‌డుతున్న ప్ర‌భావం గురించి ఇప్పుడిప్పుడే అంద‌రికీ తెలుస్తోంది. తాజాగా నిర్వ‌హించిన ఓ అధ్య‌యనం క‌ర్బ‌న ఉద్గారాల విడుద‌ల‌కు, దేశాల‌కు ఇచ్చే క్రెడిట్ రేటింగ్‌ల‌కు మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని విశ్లేషించింది. భార‌త్ స‌హా ప‌లు దేశాలు 2030 నుంచి ఈ ముప్పును ఎదుర్కోనున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. యూఏఈకి చెందిన యూనివ‌ర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంగ్లియా, కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా ఈ ప‌రిశోధ‌న నిర్వ‌హించాయి. మొత్తం […]

  • By: krs    latest    Aug 09, 2023 5:54 AM IST
Carbon Emissions | దేశాల క్రెడిట్ రేట్ల‌పై క‌ర్బ‌న ఉద్గారాల ప్ర‌భావం.. భార‌త్ స‌హా ప‌లుదేశాల‌కు హెచ్చ‌రిక‌

Carbon Emissions |

ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌ వ‌ల్ల దేశ ఆర్థిక ప‌రిస్థితిపై ప‌డుతున్న ప్ర‌భావం గురించి ఇప్పుడిప్పుడే అంద‌రికీ తెలుస్తోంది. తాజాగా నిర్వ‌హించిన ఓ అధ్య‌యనం క‌ర్బ‌న ఉద్గారాల విడుద‌ల‌కు, దేశాల‌కు ఇచ్చే క్రెడిట్ రేటింగ్‌ల‌కు మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని విశ్లేషించింది. భార‌త్ స‌హా ప‌లు దేశాలు 2030 నుంచి ఈ ముప్పును ఎదుర్కోనున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. యూఏఈకి చెందిన యూనివ‌ర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంగ్లియా, కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా ఈ ప‌రిశోధ‌న నిర్వ‌హించాయి.

మొత్తం 108 దేశాల‌కు సంబంధించిన క‌ర్బ‌న ఉద్గారాల వివ‌రాల‌ను, ఆర్థిక స్థితుల‌ను వీరు ఏఐ ద్వారా విశ్లేషించారు. త‌ద్వారా 10, 30, 50 ఏళ్ల కాలానికి ఫ‌లితాల‌ను అధ్య‌య‌నంలో పొందుప‌రిచారు. ఈ ఫ‌లితాలు మేనేజ్‌మెంట్ సైన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. వ‌చ్చే ద‌శాబ్ద కాలంలో భారత్, చిలీ, ఇండోనేషియా, చైనా, అమెరికా, కెన‌డా దేశాల క్రెడిట్ రేటింగ్‌ల‌లో 2 పాయింట్లు, యూకేకు 1 పాయింట్ కోత ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది.

క్రెడిట్ రేటింగ్స్ అంటే..

వ్య‌క్తిగ‌త ఆర్థిక ఆరోగ్యానికి మ‌నిషికి సిబిల్ స్కోర్ ఎలానో దేశ ఆర్థిక ప‌రిస్థితికి క్రెడిట్ రేటింగ్ ఒక కొల‌మానం. అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఇచ్చే ఈ రేటింగ్‌ను ప‌రిశీలించే విదేశీ సంస్థ‌లు ఒక దేశంలో పెట్టుబ‌డి పెట్టాలా వ‌ద్దా అనే నిర్ణ‌యించుకుంటాయి. అప్పులు పుట్ట‌డం, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవ‌డంలోనూ దీనిది కీల‌క పాత్ర‌. ఒక వేళ ఈ క్రెడిట్ రేట్ దెబ్బ‌తింటే ఈ ప్ర‌యోజ‌నాలు పొంద‌డంలో అడ్డంకులు ఏర్ప‌డ‌తాయి. దీర్ఘ కాలంలో ఇది తీవ్ర ఆర్థిక క‌ష్టాల‌కు దారి తీస్తుంది.

ఈ అధ్య‌యనం ఏం చెప్పింది?

క‌ర్బ‌న ఉద్గారాల క‌ట్ట‌డికి చిత్త‌శుద్ధితో చ‌ర్య‌లు తీసుకోక‌పోతే చాలా దేశాల క్రెడిట్ రేటింగ్‌లు దెబ్బ‌ తింటాయ‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. ఈ శ‌తాబ్దం అంతానికి 81 దేశాలు స‌రాస‌రి 2.18 పాయింట్ల‌ను కోల్పోతాయ‌ని, భార‌త్‌, కెన‌డా వంటి దేశాలు ఐదు క్రెడిట్ పాయింట్ల‌ను, చిలీ, చైనా దేశాలు ఏకంగా ఏడు పాయింట్ల‌ను న‌ష్ట‌పోతాయ‌ని తెలిపింది.

తాము కేవ‌లం క‌ర్బ‌న ఉద్గారాల విడుద‌ల‌నే తీసుకున్నామ‌ని.. ఒక వేళ దానివ‌ల్ల సంభ‌వించే వ‌ర‌ద‌లు, క‌ర‌వు ప‌రిస్థితులు, మ‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఆ న‌ష్టం ఇంకా ఎక్కువ ఉండొచ్చని హెచ్చ‌రించింది. ఉష్ణోగ్ర‌త‌ల పెరుగుద‌ల‌ను రెండు డిగ్రీల‌కే నియంత్రించే ప్యారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందాన్ని నిక్క‌చ్చిగా అమ‌లు చేసినా.. ఈ క్రెడిట్ రేటింగ్‌ల త‌రుగుద‌ల‌ను నిలువ‌రించలేమ‌ని… అయితే దీర్ఘ కాలంలో ఆ చ‌ర్య‌లు లాభాలు తెచ్చిపెడ‌తాయ‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు వివ‌రించారు.

‘ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌కు, వాస్తవ ప్ర‌పంచంలోని ఆర్థిక మార్కెట్ల‌కు మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని ఈ అధ్య‌య‌నం చ‌క్క‌గా ప‌రిశీలించింది. ఈ త‌ర‌హా ప్ర‌యోగాల్లో ఇదే మొద‌టిద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. క‌ర్బ‌న ఉద్గారాల వ‌ల్ల ఆర్థిక రంగంలో త‌లెత్తే దుష్ప‌రిణామాల‌ను మ‌నం 2030 నుంచి అనుభ‌విస్తాం’ అని ఈ అధ్య‌య‌నానికి నేతృత్వం వ‌హించిన పాంట్రీసా క్లుసాక్ అభిప్రాయ‌పడ్డారు.