శ్రీవారి ఆలయంలోని జయ విజయ తలుపులకు రూ.1.69 కోట్లతో బంగారు తాపడం
శ్రీవారి ఆలయంలోని జయ విజయుల వద్ద వున్న ద్వారాలకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు

- రూ.4 కోట్లతో 4, 5, 10 గ్రాముల తాళిబొట్ల తయారీ
- గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మొక్కాల మిట్ట, తాళ్లపాలకల్లో నిత్యసంగీతార్చన
- టీటీడీ నుంచి రమణ దీక్షితుల తొలగింపు
- ఏటా ఫిబ్రవరి 24 తిరుపతి ఆవిర్భావ దినోత్సవం
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పుంపు
- టీటీడీ పాలక మండలి నిర్ణయాలు
తిరుపతి: శ్రీవారి ఆలయంలోని జయ విజయుల వద్ద వున్న ద్వారాలకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రూ.4 కోట్ల వ్యవయంతో 4,5,10 గ్రాముల తాళి బొట్లు తయారు చేయాలని నిర్ణయించామన్నారు. వీటి తయారీని నాలుగు కంపెనీలకు టెండర్ ద్వారా కేటాయించామని తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోక్కాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చనతో పాటు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మించి, నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సోమవారం టీటీడీ పాలక మండలి నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందున ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తున్నామన్నారు. టీటీడీ పాలక వర్గం ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు మండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
తిరుపతి అవిర్భావ దినోత్సవాలను ప్రతి ఏటా పిబ్రవరి 24వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇందుకోసం రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు శేఖర్ రెడ్డి సముఖత వ్యక్తం చేశారన్నారు.
తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు చేయించాలని, రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం చేపట్టాలని నిర్ణయించామన్నారు. రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిథి గృహం ఆధునీకరిస్తామని తెలిపారు. రూ.3.15 కోట్లతో తిరుమలలోని జలాశయాలలో వున్న 682 మోటర్ పంపులు మార్పు చేస్తామన్నారు. తిరుమలలోని అతిథి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3 సంవత్సరాలు పొడిగించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు.
తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునీకరణ చేపడతామని టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుపతిలోని హరేరామ హరేకృష్ణా రోడ్డులో రూ. 7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామన్నారు. రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత పుస్తకాలు ముద్రించనున్నట్టు తెలిపారు. స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు అందించాలని నిర్ణయించామన్నారు. రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం చేపడతామన్నారు. అన్నదానంలో రూ.3కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం అందిస్తుందన్నారు. కళ్యాణం నిర్వహణకు ఆమోదం తెలిపిందన్నారు.
టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్,కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అలాగే టీటీడీ అటవీ విభాగంలోఒ పని చేసే అటవీ కార్మికుల జీతాలు పెంచుతున్నామన్నారు. టీటీడీలోని అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీపై భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించామన్నారు. జమ్మూలోని సిబ్బంది హెచ్ఆర్ఏ పెంచుతున్నట్లు వెల్లడించారు.
వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ. 8.16 కోట్లు చెల్లిస్తామన్నారు. 15 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. సూపర్‌వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే టీటీడీలోని క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇస్తామని తెలిపారు. దీంతో పాటు వెంకటశివ కృష్ణ ప్రసాద్ పదవి కాలం మూడు సంవత్సరాలు పెంచుతున్నామన్నారు.