Tirumala Srivari Simha Vahanam | తిరులమల శ్రీవారికి సింహవాహనం..స్వర్థ రథం సేవలు
తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సింహవాహనం, స్వర్ణరథం సేవలు.. భక్తులు గోవింద నామస్మరణలతో పులకరింత.

విధాత : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజైన సోమవారం ఉదయం శ్రీవారిని సింహవాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు సింహవానధారి శ్రీనివాసుడిని దర్శించుకుని పులకించారు. సాయంత్రం మలయప్ప స్వామిని స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగించారు. తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విహారాన్ని తిలకించిన భక్తులు గోవింద నామస్మరణలలో పారవశ్యం చెందారు. స్వర్థరథం ఊరేగింపులో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రాత్రి శ్రీవారిని గజవాహనంపై ఊరేగించారు.
ఆకట్టుకున్న సాంస్కృతి కార్రక్రమాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల నుండి విచ్చేసిన ప్రసిద్ధ కళాబృందాలు అద్భుతమైన ప్రదర్శనలతో వాహనసేవలకు ఆధ్యాత్మిక శోభను, విశేషమైన కళాత్మకతను తీసుకొస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మొత్తం 26 కళాబృందాలకు చెందిన 607 మంది కళాకారులు తమ ప్రదర్శనలను ఇచ్చారు. దేశంలోని 18 రాష్ట్రాల నుండి బృందాలు ఈ సేవలో భాగమయ్యాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, తెలంగాణ, ఒడిస్సా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మణిపూర్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ వంటి 15కు పైగా రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సాంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కేరళ నుంచి వచ్చిన యక్షగానం (నవదుర్గ), తమిళనాడు నుంచి పాండిచ్చేరి ఫోక్ డాన్స్, మైలట్టం, కర్ణాటక నుంచి పిన్నాల్ ఆండాళ్ డాన్స్ వంటి సాంప్రదాయ నృత్యాలు ఆయా ప్రాంతాల సంస్కృతిని, వైవిధ్యతను కళ్లకు కట్టారు. తెలంగాణ బృందం ప్రదర్శించిన కోలాటం భక్తులను ఉల్లాసపరిచింది. హర్యానా నుంచి ప్రదర్శించిన ఉల్లాసభరితమైన నృత్యాలు, హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ నృత్యాలు, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన చౌమయూర్ బంజ్ ప్రదర్శనలు ఉత్తరాది కళా వైవిధ్యాన్ని చాటాయి.
జమ్ము కాశ్మీర్ నుంచి వచ్చిన రౌఫ్ నృత్యం, పంజాబ్ లూధి నృత్యాలు ఉత్తర భారతదేశపు ఉల్లాసభరితమైన జానపద సంస్కృతిని ప్రతిబింబించాయి. ఒరిస్సా నుంచి ప్రదర్శించిన ప్రసిద్ధ సంబల్పూడి నృత్యం ప్రత్యేకమైన గౌటిపు నృత్యాలు కనువిందు చేశాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి పంతి నృత్యం, బీహార్ నుంచి వచ్చిన సమాచకేవ ప్రదర్శనలు మధ్య భారతీయ సాంప్రదాయ శైలిని ఆవిష్కరించాయి. మణిపూర్ నుంచి మైబిజాగోయి నృత్యం ఈశాన్య భారతదేశపు సంస్కృతిని పరిచయం చేసింది. మహారాష్ట్ర నుంచి గొందళ్ నృత్యం, శక్తివంతమైన డ్రమ్ముల విన్యాసాలు ప్రేక్షకులకు ఉత్తేజాన్నిచ్చాయి. గోవా కల్చరల్ డిపార్ట్‌మెంట్ సమర్పించిన గోవా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీరామ పట్టాభిషేకం, రామావతారం వంటి పౌరాణిక ఘట్టాలను కళాకారులు తమ నృత్య రూపకాల ద్వారా అద్భుతంగా ప్రదర్శించి, భక్తి భావాన్ని పెంపొందించారు.