IND vs AUS: ప్రాక్టీస్‌లో టీమిండియా బిజీబీజీ.. డైరెక్ట్‌గా బరిలోకి ఆసీస్
INDvsAUS స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లే.. అన్నీ టర్నింగ్ వికెట్లే..! అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్‌లతో పటిష్ఠంగా టీమ్ ఇండియా లైయన్, అగర్, మర్ఫీ పార్ట్ టైమర్లు హెడ్, స్మిత్‌లతో ఆసీస్ స్పిన్ కళకళ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను తిప్పేస్తారా..? స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లంటున్న అభిమానులు.. స్వదేశంలో భారత్ బలం అంటే స్పిన్.. వరుస సిరీస్‌ల విన్నింగ్ సీక్రెట్ అంటే స్పిన్.. బ్యాటింగ్ ఎలా ఉన్నా.. మనదేశానికి వచ్చిన జట్లన్నీ గిర్రున తిరిగే బంతులకు మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే […]

INDvsAUS
- స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లే.. అన్నీ టర్నింగ్ వికెట్లే..!
- అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్‌లతో పటిష్ఠంగా టీమ్ ఇండియా
- లైయన్, అగర్, మర్ఫీ పార్ట్ టైమర్లు హెడ్, స్మిత్‌లతో ఆసీస్ స్పిన్ కళకళ
- బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను తిప్పేస్తారా..?
- స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లంటున్న అభిమానులు..
స్వదేశంలో భారత్ బలం అంటే స్పిన్.. వరుస సిరీస్‌ల విన్నింగ్ సీక్రెట్ అంటే స్పిన్.. బ్యాటింగ్ ఎలా ఉన్నా.. మనదేశానికి వచ్చిన జట్లన్నీ గిర్రున తిరిగే బంతులకు మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే అంతలా తిప్పేస్తారు.. మన వికెట్లు కూడా టర్నింగ్‌కు అనుకూలిస్తాయి.. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించినా.. చివరి మూడు రోజులు గింగరాలు తిరిగే బంతులకు బ్యాట్స్ మెన్ దాసోహం అనాల్సిందే. ఒక్క భారత్ అనే కాదు.. దాదాపు ఉపఖండం పిచ్ లన్నీ స్పిన్‌కు స్వర్గధామమే అంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్‌లో భాగంగా భారత్ –ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్న 4 టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కూ స్పిన్ ట్రాకులేనా అంటే నిజమే అని అన్నట్లుగా రెండు జట్ల సన్నాహకాలు ఉన్నాయి.. మరి స్పిన్‌తో విన్నింగ్ మనకు ఈజీనేనా అంటే ఏదో మూల కొంత సందేహం.. ఇటీవలి కాలంలో మన బ్యాట్స్ మెన్ స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లకు వేసిన స్పిన్ ఉచ్చుకు మన బ్యాట్స్ మెన్ చిక్కి ఓడిన సందర్భాలున్నాయి. మరి ఈ సిరీస్‌లో ఏం జరగబోతోంది.. ఆసీస్‌ను చిక్కించుకుంటారా..? మరి మనోళ్లే దొరికిపోతారా..?
(విధాత ప్రత్యేకం)
నాగపూర్ టెస్టుతో 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభానికి ముందు రెండు జట్ల ప్రిపరేషన్ గమనిస్తేనే మనకు ఈ విషయం అర్థం అవుతుంది.. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఈ నెల 2వ తేదీ నుంచి నాగపూర్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే.. ఆసీస్ జట్టు బెంగళూరు సమీపంలో ముమ్మరంగా ప్రిపరేషన్‌లో మునిగి పోయింది.. ఏదైనా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు పర్యటనకు వచ్చిన జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడడం రివాజు. కానీ అనూహ్యంగా ఆసీస్ జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లాడేందుకు అంగీకరించలేదు. కేవలం ప్రాక్టీస్ చేసి డైరెక్ట్‌గా నాగపూర్‌లో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతామని చెప్పింది.
టీమ్ ఇండియా ప్రిపరేషన్ ఇలా..
స్పిన్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవడం ఎలా..? మన బ్యాట్స్ మెన్ ఆసీస్ స్పిన్నర్లను ఫేస్ చేసేందుకు గాను టీమ్ ఇండియా మేనేజ్మెంట్ 5గురు స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. మెయిన్ టీమ్‌లో నలుగురు అగ్రశ్రేణి స్పిన్నర్లున్నా.. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయాల్సిన అవసరం ఉంది. దీంతో అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్‌లకు వర్క్ లోడ్ తగ్గించేలా టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ వ్యూహం రెడీ చేసుకుంది.
నెట్ బౌలర్లుగా ఎంపిక చేసిన వారేమీ తక్కువ వారు కాదు.. ఆఫ్ స్పిన్నర్లు జయంత్ యాదవ్, వాషింగ్టన్ సుందర్.. నాలుగు టెస్టుల పాటు జట్టుకు నెట్ బౌలర్లుగా సేవలందించనున్నారు. వీరే ఎందుకంటే ఆసీస్ జట్టు మెయిన్ స్పిన్నర్ నాథన్ లైయన్ ఆఫ్ స్పిన్నర్.. అంతేకాదు కొత్తగా జట్టులోకి వచ్చిన టాడ్ మర్పీతో పాటు ట్రావిస్ హెడ్ కూడా ఆఫ్ స్పిన్నర్ కావడంతో భారత్ వీరిని దీటుగా ఎదుర్కొనేలా నెట్ బౌలర్లుగా జయంత్, వాషింగ్టన్ సుందర్ లను ఎంపిక చేసింది.
Look who’s back in the nets.
Rohit Sharma last played a Test in march 22 against Sri Lanka.#INDvsAUS #BGT #BGT2023 #RavichandranAshwin #BorderGavaskarTrophy #RaviShastri #Ashwin #Cricket #RohitSharma #ViratKohli pic.twitter.com/xNWlF2vKYF— OneCricket (@OneCricketApp) February 7, 2023
మరోవైపు టాల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు యూపీకి చెందిన సౌరభ్ కుమార్, తమిళనాడుకు చెందిన సాయికిషోర్ ఉన్నారు. వీరు ఎందుకంటే ఆసీస్ జట్టులో టాల్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆస్టిన్ అగర్ ఉండడమే కారణం. రాహుల్ చహర్ రూపంలో లెగ్ స్పిన్నర్‌నూ నెట్ బౌలర్‌గా అపాయింట్ చేసింది. క్వికెస్ట్ లెగ్ స్పిన్ వేసే రాహుల్ చహర్.. ఆసీస్ జట్టులోని మిచెల్ స్వప్నన్‌ను తలపిస్తాడు. ఆసీస్ వ్యూహాలకు ప్రతి వ్యూహంగా ఈ 5 గురు స్పిన్నర్లు భారత బ్యాట్స్ మెన్‌కు సిరీస్ ఆసాంతం ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ చేయనున్నారు.
స్పిన్ బౌలింగ్‌కు తడబడుతున్న భారత బ్యాట్స్ మెన్‌కు తగినంత ప్రాక్టీస్ లభిస్తే చాలని.. అందుకే ఈ ఏర్పాటు చేస్తూ వారిపై ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడించడం లేదని జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా చెప్పాడు. స్వదేశంలో వరుస విజయాల రికార్డు కాపాడుకోవడం.. జట్టును అన్ని విధాల తీర్చిదిద్దడం.. టెస్టుల్లోనూ నంబర్ వన్ స్థానం అందుకోవడం.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరడం ఇన్ని టార్గెట్స్ తో టీమ్ ఇండియా టెస్టు సిరీస్‌కు సై అంటోంది.
ఆసీస్ ప్రిపరేషన్ ఇలా..
భారత్‌కు ధీటుగా ఆస్ట్రేలియా జట్టు కూడా ప్రిపరేషన్ చేస్తూ ఈ సిరీస్ ఫలితంపై హీట్ పెంచుతోంది. భారత్ స్పిన్‌ను ధైర్యంగా ఎదుర్కోవడం కోసం పిచ్‌లో ఎక్కువగా ప్యాచ్‌లుగా పెట్టుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. బరోడాకు చెందిన మహేశ్ వితియా అనే స్పిన్నర్, జమ్ముకశ్మీర్‌కు చెందిన అబిద్ ముస్తాక్ అని క్వికెస్ట్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను నెట్ బౌలర్లుగా ఎంపిక చేసుకున్నారు.
ఈ రంజీ సీజన్‌లో 32 వికెట్లు తీసుకున్న అబిద్ అద్భుతంగా రాణించాడు. మహేశ్ వితియా కూడా భారత స్పిన్నర్ అశ్విన్‌ను తలపించే యాక్షన్‌తో బౌలింగ్ చేయడంతో అతను రంజీలు ఆడకపోయినా.. ఆసీస్ జట్టు అతన్ని ఎంపిక చేసుకుంది. సో.. రెండు జట్లూ స్పిన్నర్లతో ప్రిపరేషన్ చేస్తుండడం.. స్పిన్ బౌలింగ్ ను బలంగా మార్చుకోవడంతో ఈ సిరీస్ ఆసాంతం టష్‌గా సాగుతుందని చెప్పొచ్చు.
అంతేకాదు.. ఆసీస్ జట్టు గతంలో ఎన్నడూ లేనంతగా 18 మంది స్క్వాడ్‌తో తరలివచ్చింది. జట్టులో ట్రావిస్ హెడ్, లబుషేన్ స్పిన్ వేయగలరు. అంతేకాదు స్మిత్ లెగ్ స్పిన్నర్ కెరీర్ మొదట్లో లెగ్ స్పిన్నర్‌గా ప్రారంభించినా అనంతరం బ్యాట్స్ మెన్‌గా స్థిరపడ్డాడు. ఎన్నడూ లేనంతగా ఆసీస్ జట్టు ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తుండడం.. భారత్ వ్యూహాలు కూడా ఇదేరీతిన సాగుతుండడం ఈ సిరీస్‌కు స్పిన్ ట్రాకులుంటాయన్న హింట్ అందిస్తోంది. ఈ సిరీస్‌లో మూడో రోజు నుంచి కాదు డే 1 నుంచే బంతి గింగరాలు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.