India-France | రక్షణ రంగంలో చెట్టాపట్టాల్.. ఒప్పందాలు కుదుర్చుకున్న ఫ్రాన్స్ – భారత్
India-France విధాత: యుద్ధ విమాన ఇంజిన్‌ను, ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) ఇంజిన్‌ను ఉమ్మడిగా రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని భారత్, ఫ్రాన్స్ దేశాలు శుక్రవారం ప్రకటించాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi), ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 2047కి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్న దానిపై ఇరువురు నేతలూ ఈ సమావేశంలో చర్చించారు. భారత్, ఫ్రాన్స్ తమ రక్షణ (Defence) బంధాన్ని […]

India-France
విధాత: యుద్ధ విమాన ఇంజిన్‌ను, ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) ఇంజిన్‌ను ఉమ్మడిగా రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని భారత్, ఫ్రాన్స్ దేశాలు శుక్రవారం ప్రకటించాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi), ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
2047కి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్న దానిపై ఇరువురు నేతలూ ఈ సమావేశంలో చర్చించారు. భారత్, ఫ్రాన్స్ తమ రక్షణ (Defence) బంధాన్ని మరింత విస్తరించుకుంటాయి. యుద్ధ విమానం ఇంజిన్‌ను కలిసి తయారుచేయడం ద్వారా విమానరంగంలో ఈ బంధం మరింత బలపడుతుంది అని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది.
ఇంజిన్ల సాంకేతిక బదిలీకి ఫ్రాన్స్ ఒప్పుకోవడం ఇరుదేశాల మధ్య ఉన్న బంధానికి ఉదాహరణ అని తెలిపింది. ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) ఇంజిన్ అభివృద్ధికి భాగస్వామ్య పక్షాలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఏ ఎల్), సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్ ఫ్రాన్స్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించింది.
ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకమే పెట్టుబడిగా రక్షణ రంగంలో జాయింట్ డెవలప్‌మెంట్ వెంచర్లు ప్రారంభమవుతాయని ఎంఈఏ తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై డీఆర్‌డీఓ, సాఫ్రాన్‌లు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాయి. ఇరుదేశాలు రక్షణ ఆయుధాలను ఉమ్మడిగా డిజైన్, తయారుచేసేలా ప్రయత్నించాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ఇవి ఫ్రాన్స్, భారత్‌ల అవసరాలు తీర్చడమే కాకుండా.. తృతీయ దేశాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగపడతాయని వెల్లడించారు. కాగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ విమానాలు, 3 స్కార్పిన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌లను భారత నావికా దళం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డిఫెన్స్ అక్విజియేషన్ కౌన్సిల్ తన ఆమోదాన్ని వెలువరించింది. అయితే దీనిపై మోదీ పర్యటనలో ఎటువంటి అధికారక ప్రకటన వెలువడలేదు.