పరుగుల తుఫాన్‌లో కివీస్‌ గల్లంతు.. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానానికి భారత్‌

వన్డే సిరీస్ మనదే.. మూడో వన్డేలోనూ విజయంతో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్‌ సెంచరీలతో గర్జించిన ఓపెనర్లు రోహిత్, శుభ్ మన్ గిల్ ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించిన హార్దిక్.. బౌలింగ్ లో చెలరేగిన శార్దూల్ 3-0 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్న భారత సేన ఇండోర్‌: వరుసగా మూడో వన్డేలోనూ పరుగుల తుఫాన్‌లో కివీస్‌ జట్టు గల్లంతైంది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ […]

  • By: krs    latest    Jan 25, 2023 2:59 AM IST
పరుగుల తుఫాన్‌లో కివీస్‌ గల్లంతు.. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానానికి భారత్‌
  • వన్డే సిరీస్ మనదే..
  • మూడో వన్డేలోనూ విజయంతో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్‌
  • సెంచరీలతో గర్జించిన ఓపెనర్లు రోహిత్, శుభ్ మన్ గిల్
  • ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించిన హార్దిక్.. బౌలింగ్ లో చెలరేగిన శార్దూల్
  • 3-0 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్న భారత సేన

ఇండోర్‌: వరుసగా మూడో వన్డేలోనూ పరుగుల తుఫాన్‌లో కివీస్‌ జట్టు గల్లంతైంది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టును ఓడించి సిరీస్‌ను 3–0తో దక్కించుకుంది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టిన రోహిత్‌ సేన మూడో స్థానం నుంచి మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు.

386 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. కివీస్ జట్టులో ఓపెనర్‌ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో రాణించడంతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు శార్దుల్‌కు దక్కగా… శుబ్‌మన్‌ గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అందుకున్నాడు.

ఓపెనర్ల జోరు.. టీమ్ ఇండియా భారీస్కోరు

చాలాకాలం తర్వాత సెంచరీతో రోహిత్ శర్మ ఇండోర్ వన్డేలో చెలరేగగా ..గిల్ మరోసారి శతకం సాధించి తన సూపర్ ఫాం కంటిన్యూ చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన భారత ఓపెనర్ల ధాటికి స్కోరు 12.4 ఓవర్లలోనే వంద దాటింది. గిల్‌ 33 బంతుల్లో (8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ 41 బంతుల్లో (4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు.

వీరిద్దరూ కలిసి ఓవర్‌కు 8 పైచిలుకు పరుగుల రన్‌రేట్‌తో పరుగులు చేయడంతో భారత్‌ 24.1 ఓవర్లోనే 200 పరుగుల మైలురాయి చేరుకుంది. ఆ వెంటనే రోహిత్‌ 83 బంతుల్లో, గిల్‌ 72 బంతుల్లో శతకాలు పూర్తిచేసుకున్నారు. రోహిత్‌ను బౌల్డ్‌ చేసి బ్రేస్‌వెల్‌ 212 పరుగుల ఓపెనింగ్‌ వికెట్‌ కు తెరదించాడు. కాసేపటికే గిల్‌ జోరుకు టిక్నెర్‌ చెక్‌ పెట్టాడు. తర్వాత కోహ్లి (36; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ (17; 1 ఫోర్, 1 సిక్స్‌), సూర్య (14; 2 సిక్సర్లు) విఫలమయ్యారు. పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శార్దుల్‌ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేశారు.

కాన్వే పోరాడినా..

న్యూజిలాండ్‌ ఖాతా తెరువక ముందే అలెన్‌ (0)ను పాండ్యా డకౌట్ చేసినా .. మరో ఓపెనర్‌ కాన్వే (138) మెరుపు ఇన్నింగ్స్ తో అద్భుత సెంచరీ సాధించాడు.. నికోల్స్‌ (42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్ ను కుల్దీప్‌ పడగొట్టగా.. ఆ తర్వాత మిచెల్‌ (24; 2 ఫోర్లు), లాథమ్‌ (0), ఫిలిప్స్‌ (5) లను శార్దూల్ డగౌట్ బాట పట్టించాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ప్రమాదకరంగా కనిపించిన కాన్వే ను ఉమ్రా న్‌ అవుట్‌ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. చివరలో బ్రేస్‌వెల్‌ (26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సాంట్నర్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించినా పరుగుల అంతరాన్ని తగ్గించేందుకే వారి పోరాటం సరి పోయింది. పూర్తి ఆధిపత్యంతో విజయం అందుకున్న భారత్ భారీ విజయంతో మ్యాచ్ తో పాటు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

స్కోరుబోర్డు;

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) బ్రేస్‌వెల్‌ 101; గిల్‌ (సి) కాన్వే (బి) టిక్నెర్‌ 112; కోహ్లి (సి) అలెన్‌ (బి) డఫీ 36; ఇషాన్‌ (రనౌట్‌) 17; సూర్యకుమార్‌ (సి) కాన్వే (బి) డఫీ 14; పాండ్యా (సి) కాన్వే (బి) డఫీ 54; సుందర్‌ (సి) మిచెల్‌ (బి) టిక్నెర్‌ 9; శార్దుల్‌ (సి) లాథమ్‌ (బి) టిక్నెర్‌ 25; కుల్దీప్‌ (రనౌట్‌) 3; ఉమ్రాన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385.

వికెట్ల పతనం: 1–212, 2–230, 3–268, 4–284, 5–293, 6–313, 7–367, 8–379, 9–385.
బౌలింగ్‌: డఫీ 10–0–100–3, ఫెర్గూసన్‌ 10–1–53–0, టిక్నెర్‌ 10–0–76–3, సాన్‌ట్నర్‌ 10–0–58–0, మిచెల్‌ 4–0–41–0, బ్రేస్‌వెల్‌ 6–0–51–1.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (బి) పాండ్యా 0; కాన్వే (సి) రోహిత్‌ (బి) ఉమ్రాన్‌ 138; నికోల్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 42; మిచెల్‌ (సి) ఇషాన్‌ (బి) శార్దుల్‌ 24; లాథమ్‌ (సి) పాండ్యా (బి) శార్దుల్‌ 0; ఫిలిప్స్‌ (సి) కోహ్లి (బి) శార్దుల్‌ 5; బ్రేస్‌వెల్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) కుల్దీప్‌ 26; సాన్‌ట్నర్‌ (సి) కోహ్లి (బి) చహల్‌ 34; ఫెర్గూసన్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 7; డఫీ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్‌ 0; టిక్నెర్‌ (నా టౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (41.2 ఓవర్లలో ఆలౌట్‌) 295.

వికెట్ల పతనం: 1–0, 2–106, 3–184, 4–184, 5–200, 6–230, 7–269, 8–279, 9–280, 10–295.
బౌలింగ్‌: పాండ్యా 6–0–37–1, సుందర్‌ 6–0–49–0, శార్దుల్‌ 6–0–45–3, ఉమ్రాన్‌ 7–0–52–1, కుల్దీప్‌ 9–0–62–3, చహల్‌ 7.2–0–43–2.

రికార్డులు;

30 వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీలు:

అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్ల జాబితాలో పాంటింగ్‌తో కలిసి రోహిత్‌ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సచిన్‌ (49), కోహ్లి (46) టాప్‌–2లో ఉన్నారు.

360: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గిల్‌ చేసిన రన్స్‌. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా బాబర్‌ ఆజమ్‌ (పాక్‌; 2016లో విండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును గిల్‌ సమం చేశాడు