మ్యాక్సీ మాయతో కుదేలైన భారత బ్యాట్స్‌మెన్స్.. వరల్డ్ కప్ ముందు ఓటమి పాలైన భారత్

అక్టోబర్ 5 నుండి వరల్డ్ కప్ మొదలు కానుండగా, దీనికి ముందు కొన్ని జట్లు పలు సిరీస్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగగా, ఇందులో భారత్ 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది.మెగా టోర్నీకి ముందు వరుసగా ఐదు వన్డేలు ఓడిపోయిన ఆస్ట్రేలియా గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా ఆడి భారత్‌పై మంచి విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో భారత్ కన్నాఅద్భుతంగా రాణించి మూడు వన్డేల సిరీసులో చివరి మ్యాచ్ గెలిచి కాస్త రిలాక్స్ అయింది. చివరి మ్యాచ్ కోసం ఆసీస్ కెప్టెన్ కమిన్స్, స్టార్క్, మ్యాక్స్‌వెల్,మిచెల్ మార్ష్ రంగంలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లకి గాను 352 పరుగులు చేసింది.
ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో మిచెల్ మార్ష్ 96, స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేశారు. అయితే 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో గట్టిగానే బదులు ఇచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో పోరాడినా, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులతో పర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరు కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టు 49.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 286 పరుగులు చేసి 66 పరుగులు తేడాతో పరాజయం పాలైంది. అయితే సిరీస్ గెలిచామన్న సంతృప్తి భారత్‌కి ఉండగా, ఐదు వన్డేల తర్వాత మంచి విజయం దక్కిందని ఆసీస్ సంతోషంగా ఉంది.
ఇక రెండు జట్లు ఇప్పుడు వరల్డ్ కప్‌కి ముందు సన్నాహాక మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 30, 2023 – శనివారం.. ఇండియా vs ఇంగ్లాండ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతిలో జరగనుండగా, ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంలో జరగనుంది.అక్టోబర్ 3, 2023 – మంగళవారం రోజు ఇండియా vs నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంలో జరగనుండగా, పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ లో జరగనుంది. ఇక ఇదిలా ఉంటే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలుకానుండగా, 48 మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో ఫైనల్ కూడా నవంబర్ 19న అదే వేదికపై జరుగుతుంది.