Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.68.08 కోట్లు పంపిణీ : మంత్రి పొంగులేటి

Minister Ponguleti : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని…ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రూ.68.08కోట్లు పంపిణీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లను మంజూరు చేశామని..7,824 ఇండ్లు బేస్‌మెంట్ లెవల్, 895 ఇండ్ల గోడల నిర్మాణం, 64 ఇండ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.68.08 కోట్లు అందజేశామని వెల్లడించారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వీలైన చోట్ల గృహప్రవేశాలకు హాజరవుతానని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ స్థాయిని బట్టి లబ్దిదారులకి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 400చ.మీటర్ల నుంచి 600చ.మీటర్లు దాటి కట్టకూడదన్నారు. ప్రతి సోమవారం నిర్మాణ పనుల మేరకు ఇంటికి దశల వారిగా నిధులు అందిస్తుందని స్పష్టం చేశారు.