Medaram Jatara|| ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మేడారం అభివృద్ధి: మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి

సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే విధంగా మాస్టర్ ప్లాన్ లో భాగంగా శాశ్వత కట్టడాలు చేపట్టామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క అన్నారు. . జాతరకు 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో రోడ్లను ఫోర్ లైన్ చేశామని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఈ జాతరకు రికార్డు సమయంలోపునరుద్ధరణ పనులతో పాటు అన్ని వసతులు కల్పించామన్నారు. ఈ జాతరకు ముందుగానే దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు.

  • By: Subbu |    telangana |    Published on : Jan 29, 2026 7:08 PM IST
Medaram Jatara|| ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మేడారం అభివృద్ధి: మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి

విధాత, ప్రత్యేక ప్రతినిధి: సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే విధంగా మాస్టర్ ప్లాన్ లో భాగంగా శాశ్వత కట్టడాలు చేపట్టామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క అన్నారు. . జాతరకు 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో రోడ్లను ఫోర్ లైన్ చేశామని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఈ జాతరకు రికార్డు సమయంలోపునరుద్ధరణ పనులతో పాటు అన్ని వసతులు కల్పించామన్నారు. ఈ జాతరకు ముందుగానే దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. ఇప్పటికే 80 లక్షల మంది వచ్చారని, సమ్మక్క రాకతో కోటికి పైగా మంది వచ్చే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గురువారం మేడారంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

మేడారం శాశ్వత అభివృద్ధికి 70 ఎకరాలు

మేడారంలో శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రులు తెలిపారు. 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు. మంచి నీటి వ్యవస్థ, టాయిలెట్స్ శాశ్వతంగా కల్పించేలా చర్యలు చేపట్టామని అన్నారు. జాతర ప్రదేశంలో పచ్చదనం ఉండేలా చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

బాసర–భద్రాచలం టెంపుల్ సర్క్యూట్

మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా చేర్చనున్నట్లు ప్రకటించారు.

జంపన్న వాగు అభివృద్ధి ప్రణాళిక

జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. ఇందుకోసం రామప్ప–లక్నవరం–జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును రూ.145 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

మేడారానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు.

జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం సమ్మక్క–సారక్క జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు జువల్ వోరం, కిషన్ రెడ్డిలకు మంత్రులు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ అంశం త్వరలోనే సాకారమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జాతరను గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. జాతర నిర్వహణకు మరింత ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేసినట్లు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతర విజయవంతానికి సహకరిస్తున్న అధికారులు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

బైక్ల పై మంత్రుల పర్యవేక్షణ

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్ ల పై జిల్లా కలెక్టర్ దివాకర ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యం స్వయంగా తిరిగి పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. జాతరలోని అన్ని ప్రాంతాల్లో కలియతిరిగారు.