Pet Dog’s Trust: మృతుడి మర్మాంగాలకు గాయాలు..కుక్క వల్ల కాదు!

Pet Dog’s Trust: హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పద మరణం మిస్టరీ వీడింది. ఆదివారం దాసరి పవన్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క దాడి చేయడంతో మృతి చెందాడని వచ్చిన వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది వాస్తవం కాదని తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని మధురానగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో పవన్ కుమార్(35) అనే యువకుడు తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. అతను ఒక నగల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. పవన్ కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి మధురానగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఒంటరితనాన్ని అధిగమించడం కోసం సైబీరియన్ హస్కీ జాతికి చెందిన ఒక కుక్కను అతడు ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం.. పవన్ స్నేహితుడు సందీప్ అతని ఇంటికి వచ్చాడు. ఎన్నిసార్లు తలుపు కొట్టినా పవన్ తీయకపోవడంతో సందీప్‌కు అనుమానం వచ్చింది. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, పవన్ కుమార్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. పవన్ కుమార్ మర్మాంగాలను కుక్క కొరికినట్లుగా గాయాలున్నాయి. కుక్క నోటికి రక్తం కనిపించడంతో కుక్క దాడిలోనే అతను మృతిచెందినట్లుగా అనుమానించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.
అది అవాస్తవం : సీఐ
పవన్ కుమార్ కుక్క దాడిలోనే మృతిచెందినట్లుగా వచ్చిన అనుమానాలు నిజం కాదని సీఐ మహ్మద్ షాకీర్ తెలిపారు. మృతుడు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని.. అతడు ఆదివారం గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు పోస్ట్ మార్టమ్ విషయం వెల్లడైందన్నారు. యజమాని పడిపోగానే అతడిని లేపేందుకు పెంపుడు కుక్క యత్నించేక్రమంలో మర్మాంగాలపై రక్కింది. దీంతో అక్కడ గాయాలయ్యాయని తెలిపారు. పోస్టుమార్టంలో పవన్ కుమార్ మరణానికి కారణాలు వెల్లడవ్వడంతో పాటు పెంపుడు కుక్క విశ్వాసం కూడా రుజువవ్వడం పట్ల నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.