CM Chandrababu Naidu: మహిళపై దాడి ఘటన..సీఎం చంద్రబాబు సీరియస్ !

అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణ పురంలో అప్పు తీర్చడం లేదంటూ వడ్డీ వ్యాపారి మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. మహిళపై దాడికి పాల్పడిన మునికన్నప్ప, అతని కుటుంబసభ్యులను ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వడ్డీ వ్యాపారి మునికన్నప్ప వద్ద బాధితురాలు శిరీష భర్త తిమ్మరాయప్ప రూ.80 వేలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప భార్య, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు.
దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు అధికమయ్యాయి. ఆమె తన పిల్లలను కెంచనబల్ల గ్రామంలోని మేనమామ వద్ధ వదిలేసి బెంగుళూరుకు వెళ్లి కూలీ పని చేస్తూ అప్పు కొద్దికొద్దిగా చెల్లిస్తూ వస్తుంది. చిన్న కొడుకును బెంగుళూరు తీసుకెళ్లి తన దగ్గరే చదివించేందుకు నారాయణపురం పాఠశాలలో కొడుకు టీసీ కోసం వచ్చిన శిరీషను మునికన్నప్ప, కుటుంబ సభ్యులు దారి కాచి అడ్డగించి ఆమెపై దాడికి పాల్పడ్డారు. కొడుకు టీసీ చింపే ప్రయత్నం చేశారు. అడ్డుపడిన శిరీషను చెట్టుకు కట్టేసి అప్పు డబ్బులు చెల్లించడం లేదని అసభ్యంగా దూషిస్తూ మునికన్నప్ప, కుటుంబ సభ్యులు దాడి చేశారు. వెంట వచ్చిన బావ, గ్రామస్తులతో కలిసి ఆమెను విడిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి అనిత బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి భరోసా కల్పించారు.
అప్పు తీర్చలేదన్న పాపానికి.. మహిళను చెట్టుకు కట్టేసిన వైనం
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకున్న దారుణం
నారాయణపురంలో తన పిల్లలతో కలిసి నివాసముంటున్న శిరీష అనే మహిళ
3 ఏళ్ల క్రితం మునికన్నప్ప నుంచి రూ.80 వేలు అప్పు తీసుకున్న ఆమె భర్త
ఆ అప్పు కట్టలేక భర్త ఊరు… pic.twitter.com/YQbbTyEjU4
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 17, 2025