Chandrababu Serious On MLA’s Behaviour In Assembly | అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు: చంద్రబాబు
అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని AP సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి సమన్వయం అవసరం అన్నారు.
అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో వేసిన ప్రశ్నలతో ప్రభుత్వం ఇబ్బందిపడిందనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. ప్రధానంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరు గురించి ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇంచార్జీ మంత్రులదేనని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జీ మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. శాఖపరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలన్నారు. ఈ ఏడాది 93 శాతం రిజర్వాయర్లు నింపామని, విజన్ 2047లోని 10 సూత్రాల్లో ఇది ఒక కీలక పరిణామంగా ఆయన చెప్పారు. పూర్ణోదయ పథకంలో ఏపీ స్థానం లభించిందని చెబుతూ దీని ద్వారా రాష్ట్రానికి రూ. 65 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా ఉద్యాన, ఆక్వా రంగాల్లో రూ. 65 కోట్లు వచ్చే అవకాశం ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని ప్రాంతాల్లో విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లు నిర్వహించాలని ఆయన కోరారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా నెలకో ఈవెంట్ పెట్టాలని ఆయన అన్నారు.. 2028లోపుగా కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 16న కర్నూల్ లో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram