AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 70 అజెండా అంశాలపై చర్చ
సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 70 అజెండా అంశాలపై చర్చించి, భూ కేటాయింపులు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం కీలకనిర్ణయాలు తీసుకుంది… మూడున్నర గంటలపాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. మొంథా తుపాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణసాయం అందేలా చేశారని అభినందించారు. అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు. ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించగలిగామన్నారు. సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని చెప్పారు. అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులను సీఎం అభినందించారు.
పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేనివారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. త్వరతగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram