మహానగరంలో.. సామాన్యుడికి జాగా ఏదీ?

- గజం జాగా లక్షకు పైగానే
- అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు రూ. 7 వేలకు పైగా
- లక్షకు పైగా వేతనం వచ్చినా డబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ కొనలేని స్థితి
- అద్దెంటికే మొగ్గు చూపుతున్న సగటు వేతన జీవి
విధాత, హైదరాబాద్: పేదల ఊటిగా పేరు గాంచిన హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడికి సొంతిటి కల నెరవేరడం కష్టంగా మారింది. గజం జాగా కొనాలన్నా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో సగటు వేతన జీవి సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన కూడా చేయడానికి భయ పడుతున్నాడు.
లక్ష రూపాయల వేతనం వస్తుంది కదా అని ఎక్కడైనా అపార్ట్‌మెంట్ కొనుక్కుందామని ప్రయత్నించినా కోటి రూపాయలకు తక్కువ ఎక్కడా దొరకడం లేదని నవీన్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో గజం జాగా లక్ష రూపాయలు దాటి పోయింది.
ఇలా నగరంలో భూముల ధరలు ఎగువ మధ్యతరగతికి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో నిర్మాణ సంస్థలు కూడా అపార్ట్‌మెంట్ల ధరలు విపరీతంగా పెంచాయి. చదరపు అడుగు ప్రాంతాన్ని బట్టి రూ. 7 వేల నుంచి 12 వేల వరకు ధర పలుకుతున్నది. దీంతో హైదరాబాద్‌లో ఇల్లు అంటే వామ్మో అనే పరిస్థితి ఏర్పడిందని రమేశ్ అనే ఉద్యోగి తెలిపాడు.
నాడు కట్టక ముందే…
దేశంలోని ఇతర నగరాలతో పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు, భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. పదేళ్ల క్రితం భూముల ధరలకు, అపార్ట్‌మెంట్ల ధరలకు ఇప్పటి ధరలకు పొంతనేలేదని ఒక బిల్డర్ అన్నాడు. తాను చందానగర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలలో 500 గజాలు, 600 గజాల భూములు తీసుకొని అపార్ట్‌మెంట్లు నిర్మించి చదరపు అడుగు ఎక్కువలో ఎక్కువ రూ.2500 వరకు అమ్మేవాడినని సురేష్ అనే బిల్డర్ తెలిపారు.
ఆనాడు తాను పునాధులు తీసేటప్పుడే కొనుక్కోవడానికి కొనుగోలు దారులు ముందుకు వచ్చే వారన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి, భూ యజమానులు దీంతో ల్యాండ్ షేర్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు. కొనే వాళ్లు కూడా అంతగా ముందుకు రావడం లేదన్నారు. దీంతో తాము ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే కాంట్రాక్ట్ పద్దతిలో నిర్మాణం చేపడుతున్నాను
కానీ డెవలప్‌మెంట్ చేయడం లేదన్నారు. చాలా మంది పెద్ద పెద్ద బిల్డర్లే బుకింగ్‌లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటప్పుడు తమలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. తమ పరిస్థితి ఎలా ఉందంటే ఏ పని లేకుంటే నెలకు రూ. 50 వేల నుంచి లక్ష ఖర్చు అవుతుందని, అదే ఏదైనా అపార్ట్‌మెంట్ పని మొదలు పెట్టుకుంటే కోట్ల రూపాయల అప్పుతో పాటు మానసిక ప్రశాంతత కూడా పోతుందన్నారు.
భూముల ధరలు పై పైకి…
ప్రభుత్వమే భూముల ధరలు అడ్డగోలుగా పెంచింది. గండిపేటకు ఆనుకొని ఉన్న కోకాపేటలో ఎకరం రూ..100 కోట్లు పలికితే… నగరశివారు ప్రాంతమైన మోకిలలో గజం జాగా కు లక్ష ధర పలికింది. దీంతో నగరంలో ఎవరిని పలకరించినా లక్ష రూపాయలకు పైగానే ధర చెపుతున్నారు. చివరకు బస్తీలలో కూడా జాగా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇండిపెండెంట్ ఇల్లు కావాలనే కోరికతో ఎవరైనా జాగా కొనుక్కోవాలంటే వంద గజాలు కావాలన్నా కోటి రూపాయలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభినవ్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు, నా భార్య కు కలిపి రెండున్నర లక్షల వరకు వేతనం వస్తుందని, అయినా ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు.
దీంతో అపార్ట్‌మెంట్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నానన్నారు. కాస్త కంఫర్ట్‌గా ఉండడం కోసం త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు అవుతుందని, దీంతో ఏమి చేయాలా అన్న పునరాలోచనలో పడ్డామన్నారు. రూ. 3 కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తే ఇఎంఐలు కట్టడానికే తమ జీవితం మొత్తం అయి పోతుందన్నారు. చివరకు చిన్న చిన్న సంతోషాలు కూడా మర్చిపోయయే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అద్దె ఇల్లే బెటర్…
సగటు వేతన జీవి పెరిగిన భూములు, అపార్ట్‌మెంట్ల ధరలతో కొనుక్కోవడం కన్నా చివరకు అద్దె ఇల్లే బెటర్ అన్న నిర్ణయానికి వస్తున్నారు. అది కూడా అద్దెల ధరలు అడ్డగోలుగా ఉన్న మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాలు కాకుండా నాగోల్, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, పటాన్‌చెరువు, అమీన్‌పూర్, గాజుల రామారం లాంటి ప్రాంతాలలో ఇల్లు అద్దెకు తీసుకొని నివశిస్తున్నారు. మెట్రో రైల్ అందుబాటులోకి రావడంతో తక్కువ అద్దెలున్న ప్రాంతాలలో ఉంటూ వర్క్ స్టేషన్‌కు వచ్చిపోతున్నామని నరహరి అనే ప్రైవేట్ ఉద్యోగి తెలిపాడు.
ఇంటిపై పెట్టుబడి కంటే…
పెరిగిన ధరలను పరిశీలిస్తున్న అనేకమంది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఈ మధ్యకాలంలో ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం కంటే ఇతర వాటిపై పెట్టుబడి బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగులు వారి సేవింగ్స్‌ను మ్యూచువల్ ఫండ్స్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ (సిప్)లో పెట్టుబడులు పెడుతున్నారు.
అపార్ట్‌మెంట్‌లో ఇల్లు తీసుకోవడానికి రుణాలు తీసుకోవాలంటే దానికి సంబంధించి ముందుగానే బిల్డర్‌కు డౌన్ పేమెంట్ దాదాపు 30 లక్షలకు పైగానే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తున్నది. ఆ తరువాత బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు. రుణం తీసుకున్నాక నెలకు వారికి అనుగుణంగా ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాల్సి వస్తున్నది.
ఇదంతా లెక్కలేసుకుంటున్న ఉద్యోగులు, టెక్కీలు మాత్రం ఇంటిని కొనడం అనవసరంగా భావిస్తున్నారు. దీనికి బదులు సిప్‌లో పెట్టుబడి పెట్టడం మేలంటున్నారు. ప్రతి నెల 25 వేలు సిప్‌లో పెట్టుబడి పెడితే పదేళ్ల తరువాత అవి కాస్త దాదాపు రూ. 2.5 కోట్ల వరకు వస్తాయని పవన్‌రెడ్డి అనే యువ ఇంజనీర్ చెప్పాడు.
ఇంటిని కొనడం మూలంగా వారు భవిష్యత్తులో ప్రదేశం మారాలన్నప్పుడు తలనొప్పిగా మారుతుందని, ఇంటిని మెయింటేయిన్ చేయాలన్నా దానికి అదనపు ఖర్చు వస్తున్నదని లెక్కలేసుకుంటున్నారు. దీంతో అద్దిల్లే నయమంటున్నారు.