2024లోనూ యుద్ధం కొనసాగుతుంది.. హమాస్‌తో పోరాటంపై ఇజ్రాయెల్ స్పష్టత
హమాస్ ఉగ్రవాదులపై తమ యుద్ధం 2024లోనూ కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

హమాస్ (Israel – Hamas Conflict) ఉగ్రవాదులపై తమ యుద్ధం 2024లోనూ కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇప్పటికే మూడు నెలలుగా సాగుతున్న ఈ పోరులో ఇరు వైపులా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని… కాల్పుల విరమణకు రావాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న వేళ ఇజ్రాయిల్ ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం. ఒకవేళ స్వల్ప కాల కాల్పుల విరామాలు వచ్చినప్పటికీ తాము మాత్రం దీర్ఘకాల పోరుకు సన్నద్ధమై ఉంటామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డానియేల్ హగేరీ వెల్లడించారు.
కొంత మంది దళాలను గాజాలో శాశ్వతంగా నియమించేలా ఆలోచిస్తున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. రిజర్వ్ సైనికులను యుద్ధం నుంచి విరమింజేస్తున్నారన్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. యుద్ధం దీర్ఘకాలం ఉంటుందని ఇప్పటికే చెప్పినందున వారి అవసరం కూడా తమకు ఉంటుందన్నారు. కాగా గాజాపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది.
సోమవారం సాయంత్రం నుంచి రఫా నగరంలోని శరణార్థుల శిబిరంపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మృతి చెందారని హమాస్ నేతృత్వంలోని వైద్య శాఖ ప్రకటించింది. వారి మృతదేహాలను భవన శిథిలాల కింది నుంచి వెలికితీశామని పేర్కొంది. ఇక్కడే కాకుండా గాజా స్ట్రిప్ అంతటా ఇజ్రాయెల్ కాల్పులను తీవ్ర తరం చేసింది.
అక్టోబరులో జరిగిన హమాస్ హింస నేపథ్యంలో గాజా సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులు కొన్ని రోజుల క్రితం తమ గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేశారు. వారంతా త్వరలోనే తమ స్వస్థలాలకు తిరిగి రానున్నారని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్ వెల్లడించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణకాండలో 1,140 మంది ఇజ్రాయేలీయులు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ప్రతిదాడిలో 22,000 మంది చనిపోయారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.