ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబ‌సీ వ‌ద్ద‌ పేలుడు

న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పేలుడు సంభవించింది.

ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబ‌సీ వ‌ద్ద‌ పేలుడు
  • ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జ‌రుగ‌లేదు
  • ఘ‌ట‌నాస్థ‌లిలో ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ సోదాలు
  • సీసీటీవీలో క‌నిపించిన ఇద్దరు అనుమానితులు
  • అక్క‌డ లేఖను స్వాధీనం చేసుకున్న అధికారులు


విధాత‌: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తిన‌ష్టం జ‌రుగులేద‌ని, ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని అధికార‌వ‌ర్గాలు తెలిపాయి. పేలుడు ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న ఫైర్‌, పోలీస్‌, ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ బృందాలు అక్క‌డికి చేరుకొని క్షుణ్ణంగా సోదాలు నిర్వ‌హించాయి.


ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, డైరెక్టర్, అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఘ‌ట‌నా స్థ‌లంలో ఎలాంటి అనుమానిత వ‌స్తువుల‌ను గుర్తించ‌లేద‌ని తెలిపారు. నిపుణులు ఘటనాస్థలిని పరిశీలించి, సాక్ష్యాధారాలతో కూడిన ఎగ్జిబిట్ల‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతున్నార‌ని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో భద్రతను మ‌రింత‌ కట్టుదిట్టం చేసిన‌ట్టు పోలీస్ అధికారి వెల్ల‌డించారు.


పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీలో ఇద్దరు అనుమానితుల‌ కదలికలను గుర్తించిన‌ట్టు, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార‌వర్గాలు తెలిపాయి. దౌత్యకార్యాలయానికి వ‌చ్చివెళ్లిన వారి వివ‌రాలు సేక‌రించేందుకు పోలీసులు సమీపంలోని కెమెరాల ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు.


పేలుడు స్థలానికి సమీపంలో లేఖ ల‌భించిన‌ట్టు అధికార‌వ‌ర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ రాయబారిని ఉద్దేశించి టైప్ చేసిన లేఖ ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడి ఉన్న‌ట్టు పేర్కొన్నాయి. ఇంగ్లీషులో రాసిన లేఖలో గాజాలో ఇజ్రాయెల్ చర్యల గురించి ప్ర‌స్తావించారు.