Twenty20 Joins NDA | కిటెక్స్ సంస్థకు ఈడీ సమన్లు.. ట్వంటీ20ని ఎన్డీయేలో చేర్చిన కిటెక్స్ అధినేత
మరో పార్టీ అధినేత బీజేపీ వాషింగ్‌మిషన్‌లో పడి క్లీన్ చిట్ పొందబోతున్నారా? కేరళలో ఈడీ కేసులు ఎదుర్కొంటున్న కిటెక్స్ సంస్థ మద్దతు ఉన్న ట్వంటీ20 పార్టీ ఎన్డీయేలో చేరడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది.
Twenty20 Joins NDA | కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన ప్రత్యర్థులను ఈడీ, ఐటీ విభాగాల సోదాలతో బెదిరించి.. తన పంచన చేర్చుకుంటుందని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. అనేక మంది ఈడీ కేసులు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరడమో లేదా ఈడీ సోదాలు ఎదుర్కొన్న పార్టీలు ఎన్డీయేలో చేరడమో దేశం మొత్తం చూసిన విషయమే. ఆ సమయంలో వాషింగ్ పౌడర్ నిర్మా.. అంటూ సాగే పాటతో సెటైర్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి. తాజాగా మరో పార్టీ ఇదే తీరులో ఎన్డీయే పంచన చేరింది. దాని పేరు ట్వంటీ20. కేరళలో అన్నా–కిటెక్స్ గ్రూప్ మద్దతు ఉన్న రాజకీయ పార్టీ. సాబు ఎం జాకబ్ నేతృత్వంలోని కిటెక్స్ గ్రూప్‌పై ఈడీ విచారణ వేగవంతమైన నేపథ్యంలో.. ట్వంటీ20 పార్టీ ఎన్డీయేలో చేరాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కంపెనీపై విదేశీ నిధుల అక్రమ బదలాయింపు ఆరోపణలపై ఫెమా కింద ఈడీ కేసు నమోదు చేసింది. కంపెనీకి రెండు సమన్లు కూడా జారీ చేసింది. ఈ సమన్లకు జాకబ్ నేరుగా స్పందించకుండా.. తన చార్టెడ్ అకౌంటెంట్‌ను ఈడీ విచారణకు పంపారు. ఇటీవల కాలంలో విచారణ తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ట్వంటీ20 ఎన్డీయేలో చేరుతున్నట్టు జాకబ్.. జనవరి 22న ప్రకటించారు. అంతేకాదు.. ఆ మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో ఎన్డీయే కూటమిలో చేరారు. దీంతో బీజేపీకి రాష్ట్రంలో మొట్టమొదటి భాగస్వామి లభించినట్టయింది. అదికూడా.. ఆ పార్టీకి అలవాటైన పద్ధతిలోనే కావడం గమనార్హమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పరిణామంపై ఎర్నాకుళం డీసీసీ ప్రెసిడెంట్ మహ్మద్ షియాస్ స్పందిస్తూ.. ఈడీ విచారణ కారణంగా ఎన్డీయే కూటమిలో ట్వంటీ20 చేరినట్టయితే అంతకంటే హాస్యాస్పదం మరోటి ఉండదని అన్నారు.
ఎర్నాకుళం జిల్లాలో అటు అధికార ఎల్డీఎఫ్‌కు, ఇటు ప్రతిపక్ష యూడీఎఫ్‌కు ప్రత్యామ్నాయం అవుతుందని ట్వంటీ20 చెప్పుకొంటున్నది. నిజానికి ఈ పార్టీని కిళక్కంబళం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామనే హామీతో 2013లోనే స్థాపించారు. తదుపరి 2015 స్థానిక ఎన్నికల్లో ఆ గ్రామంలోని 19 వార్డులకు గాను 17 వార్డుల్లో ట్వంటీ20 ప్రతినిధులు గెలిచారు. కానీ.. తర్వాతి కాలంలో ఆ పార్టీ పట్టు నిలుపుకోలేకపోయింది. ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల్లో గతం కంటే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన కున్నతునాడు, మజువన్నూర్ పంచాయతీలను కోల్పోయింది. కోచి కార్పొరేషన్‌లో కూడా ప్రభావం చూపలేకపోయింది.
ఒక దశలో ఎన్డీయే సహా రాష్ట్రంలోని మూడు ప్రధాన కూటముల్లో ఎందులోనైనా చేరేందుకు జాకబ్ సన్నదతను ప్రకటించారు. ఆ పార్టీ రాజకీయంగా ఎలాంటి విధివిధానాలు కలిగి లేదన్న విషయం ఆ ప్రకటనతో తేటతెల్లమైంది. కేవలం రాజకీయంగా ఉనికి కాపాడుకునేందుకే కూటముల్లో చేరేందుకు సిద్ధపడిందన్న చర్చలు సాగాయి. ఈలోపే ఈడీ కేసుల పుణ్యమాని.. ఎన్డీయే పంచన చేరింది. మరిప్పుడు కిటెక్స్‌పై ఈడీ అదే దూకుడు ప్రదర్శిస్తుందా? లేక ఆ ఫైలును అటకెక్కిస్తుందా? అన్న చర్చ సాగుతున్నది. సహజంగా అయితే.. ఫైలు అటకెక్కించి, జాకబ్ సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram