ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు క్యాన్సరా? ఆయన ఏమంటున్నారు?

చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 ప్రాజెక్టుల విజయం వెనుక కీలక వ్యక్తిగా ఉన్న ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌.. క్యాన్సర్‌ బారిన పడ్డారట.

  • By: Somu    latest    Mar 04, 2024 11:42 AM IST
ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు క్యాన్సరా? ఆయన ఏమంటున్నారు?

విధాత‌: చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 ప్రాజెక్టుల విజయం వెనుక కీలక వ్యక్తిగా ఉన్న ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌.. క్యాన్సర్‌ బారిన పడ్డారట. అదికూడా.. ఆదిత్య -ఎల్‌ 1 ప్రయోగించిన రోజే తేలిందట. ఈ విషయాన్ని ఒక మలయాళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్‌ వెల్లడించారు.


‘చంద్రయాన్‌ -3 సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే.. నాకేమీ అర్థం కాలేదు. రెండు నెలల తర్వాత ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగం రోజున ఉదయం నేను స్కానింగ్‌ చేయించుకున్నాను. నా పొత్తికడుపులో ఏదో గడ్డ ఉన్నట్టు గుర్తించారు. అదిత్య ప్రయోగం తర్వాత నాకు ఆ విషయం తెలిసింది’ అని సోమనాథ్‌ చెప్పారు.


ఆ తర్వాత చెన్నైలో ఆయన దానిన ధృవీకరించుకునేందుకు మరోసారి స్కానింగ్‌ చేయించుకున్నారు. రెండు మూడు రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో వారసత్వంగా వచ్చే ఒక వ్యాధి సోకినట్టు తెలిసింది. వెంటనే తాను శస్త్ర చికిత్స చేయించుకున్నానని, అనంతరం కీమో థెరపీ కూడా చేయించానని సోమనాథ్‌ వెల్లడించారు. ఇప్పుడు తాను క్యాన్సర్‌ నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పారు.


ఈ విషయాన్ని సమీప బంధువులకు, దగ్గరి స్నేహితులకు మాత్రమే తెలిపానని పేర్కొన్నారు. తాను చెప్పిన విషయం విని వారంతా నిర్ఘాంతపోయారని తెలిపారు. క్యాన్సర్‌ నయం కాని వ్యాధికాదనేందుకు తానే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత విధులను తిరిగి ప్రారంభించానని చెప్పారు.


ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఎస్‌ సోమనాథ్‌.. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, స్పేస్‌ కమిషన్‌కు చైర్మన్‌గా 2022 జనవరి 14 నుంచి వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.