Sunita Williams: వారిద్దరు భూమికి చేరే వేళయ్యింది..!

అంతరిక్ష కేంద్రంలోనే దాదాపు 9నెలలుగా ఉన్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదికి రానున్నారు. సునీత భూమికి తిరిగి రావడం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. మార్చి 20 తర్వాత సునీత తోపాటు బుచ్ తిరిగి వస్తారని భావిస్తున్నారు.

Sunita Williams: వారిద్దరు భూమికి చేరే వేళయ్యింది..!

అంతరిక్ష కేంద్రంలోనే దాదాపు 9నెలలుగా ఉన్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదికి రానున్నారు. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగంద్వారా నలుగురు వ్యోమగాములు మెక్‌క్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అయిన సునీతా విలియమ్స్ ,విల్‌మోర్‌ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) లో ఉన్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.

టెస్ట్ మిషన్ కోసం బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్‌, విల్‌మోర్‌ 2024, జూన్‌ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌.. ఐఎస్‌ఎస్‌ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది.

అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. సునీత భూమికి తిరిగి రావడం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. మార్చి 20 తర్వాత సునీత తోపాటు బుచ్ తిరిగి వస్తారని భావిస్తున్నారు.
సునీత, బుచ్ తిరిగి రావడం గురించి, నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ ఈ మిషన్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొత్త బృందం అంతరిక్షంలోకి చేరుకున్న రెండు రోజుల తర్వాత, వ్యోమగాములు భూమికి తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.