Sunita Williams | సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణానికి 19 రోజుల డెడ్‌లైన్.. ఎందుకంటే?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్‌మోర్ (Butch Wilmore)లను యుద్ధ ప్రతిపదికన భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా కృషి చేస్తున్నది.

వాషింగ్టన్ డీసీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్‌మోర్ (Butch Wilmore)లను యుద్ధ ప్రతిపదికన భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా కృషి చేస్తున్నది. ఇందుకోసం 19 రోజుల డెడ్‌లైన్ (19-day deadline) విధించుకున్నది. వారిని భూమిపైకి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక ఇబ్బందులతో వారు భూమిపైకి రావడం వాయిదాపడుతూ వస్తున్నది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని థ్రస్టర్, హీలియం వ్యవస్థలు సరిగ్గా పనిచేయక ఈ ఇబ్బంది తలెత్తింది. మరోవైపు క్రూ 9 మిషన్ (Crew-9 mission) ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో తన ప్రయత్నాలను నాసా ముమ్మరం చేసింది.
స్పేస్‌క్రాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను సరిచేసేందుకు ఇంజినీర్లు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయాలపైనా దృష్టిసారించారు. ఈ చాలెంజింగ్ మిషన్‌లో వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్స్యూల్ (SpaceX Dragon capsule) ను వినియోగించే అంశంపైనా ఆలోచనలు జరుగుతున్నాయి.
జూన్ 13, 2024న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న స్టార్‌లైనర్ వారంలోపు మిషన్ ముగియగానే భూమిపైకి తిరిగి రావాల్సి ఉన్నది. జూన్ 5, 2024న కేప్ కార్నివాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ (Cape Canaveral Space Force Station) నుంచి సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు.
స్టార్‌లైనర్ అంతరిక్షంలో ఎలా స్టక్ అయింది?
స్టార్‌లైనర్‌ను బోయింగ్ సంస్థ రూపొందించింది. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో మైలురాయిగా భావించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ తన తొలి మానవ సహిత పరీక్షకు ఉద్దేశించిన యాత్రతో సునీత, విల్‌మోర్‌లను తీసుకొని వెళ్లింది. స్పేస్ స్టేషన్‌తో డాక్ అవడంలో సక్సెస్ అయినా.. దానిలోని మొత్తం 28 థ్రస్టర్లకు గాను ఐదు వాటంతటవే పనిచేయడం ఆగిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్‌లో ఐదు చిన్నపాటి హీలియం లీకేజీలను కూడా ఇంజినీర్లు గుర్తించారు. వీటి కారణంగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం సాధ్యం కావడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నాసా, బోయింగ్ ఇంజినీర్లు స్టార్‌లైనర్ కంపెనీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సునీత, విల్‌మోర్ తిరుగుప్రయాణానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను (return timeline) ఇంకా నిర్ధారించలేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ (Steve Stich) తెలిపారు. భూవాతావరణంలోకి స్పేస్‌క్రాఫ్ట్ ప్రవేశించడానికి థ్రస్టర్లు, హీలియం వ్యవస్థ అత్యంత కీలకమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా వ్యోమగాముల భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతుంది.
వ్యోమగాముల రక్షణ ఎందుకు క్లిష్టంగా మారింది?
త్వరలో క్రూ9 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉన్నది. అది అక్కడికి వెళ్లాలంటే అక్కడ ప్రస్తుతం ఉన్న స్టార్‌లైనర్ ఆన్‌డాక్ కావాల్సి ఉంటంది. క్రూ9 మిషన్‌ను ఆగస్ట్ 18, 2024న ప్రయోగించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దీని నుంచి నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మెన్, నిక్ హేగ్, స్టీఫెన్ విల్సన్‌తోపాటు కాస్మొనాట్లు అలెగ్జాండర్ గోర్బునోవ్ స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌లైనర్‌ను బాగుచేసేందుకు నాసా ఇంజినీర్లు 19 రోజుల డెడ్‌లైన్ విధించుకున్నారు. ఒకవేళ స్టార్‌లైనర్ కదల్లేని పరిస్థితి ఉంటే.. ప్రత్యామ్నాయ మార్గంలో సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్‌ను భూమి మీదకు (alternative methods to bring Williams and Wilmore) తీసుకురానున్నారు. అందుకోసం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ కాప్స్యూల్‌ను వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇబ్బందులు ఎలా ఉన్నా.. తాము భూమి మీదకు వచ్చి తీరుతామని విల్‌మోర్ విశ్వాసం వ్యక్తం చేశారు.