Jangaon | జనగామలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రక్తపు మరకలు?

Jangaon | హత్యలో అధికార పార్టీ నాయకుల హస్తం నిజాయితీ పొట్టన పెట్టుకుందా? కేసును నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లాలో కిడ్నాప్‌కు గురైన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హ‌త్య తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. హత్య వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఈ హత్యకు సంబంధించిన మరకలు అంటుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల పక్షపాతిగా […]

  • By: krs    latest    Jun 18, 2023 9:57 AM IST
Jangaon | జనగామలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రక్తపు మరకలు?

Jangaon |

  • హత్యలో అధికార పార్టీ నాయకుల హస్తం
  • నిజాయితీ పొట్టన పెట్టుకుందా?
  • కేసును నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లాలో కిడ్నాప్‌కు గురైన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హ‌త్య తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. హత్య వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఈ హత్యకు సంబంధించిన మరకలు అంటుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజల పక్షపాతిగా నిజాయితీగా ఉండడమే రామకృష్ణ ప్రాణాలు తీసింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భూకబ్జాదారుల ఆగడాలను అడ్డుకున్నందుకే ఆయన హత్యకు పక్కా ప్రణాళిక రచించే అమలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈనెల 15న కిడ్నాప్

బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య ఈనెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్వగ్రామం నుంచి బైక్‌పై బచ్చన్నపేటకు బయల్దేరిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం జనగామ జిల్లా కేంద్రానికి స‌మీపంలోని చంపక్ హిల్స్ ప్రాంతంలోని చెట్ల పొద‌ల్లో రామకృష్ణయ్య మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

రామకృష్ణ కిడ్నాప్ అయినా అదే రోజు ఆయ‌న కుమారుడు అశోక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ద‌ర్యాప్తు ఆరంభించారు. ఎవ‌రైనా కిడ్నాప్ చేసి ఉంటార‌ని అశోక్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అలెర్ట‌యిన జ‌న‌గామ పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సీసీటీవీ పుటేజ్‌ల ఆధారంగా అతడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఆదివారం చంపక్ హిల్స్ ప్రాంతంలో శవమై క‌నిపించాడు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆరోపణలు

తండ్రి అదృశ్యం వెనుక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నాడ‌ని మృతుని కొడుకు ఆరోపించిన మ‌రుస‌టి రోజే శవమై కనిపించారు. తండ్రి రామ‌కృష్ణ‌ మిస్సింగ్ వెనుక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హస్తం ఉందని కొడుకు అశోక్‌ శనివారం బ‌చ్చ‌న్న‌పేట‌లోని విలేక‌రుల స‌మావేశంలో ఆరోపించారు. కొద్దిరోజులుగా ఆర్టీఐ ల ద్వారా నేత‌ల భూ కబ్జాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నందుకే త‌న‌తండ్రిని కొంత‌మంది కిడ్నాప్ చేసి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం చేశారు.

అశోక్ శ‌నివారం ఆరోప‌ణ‌లు చేయ‌గా, ఆదివారం ఉద‌యం పోలీసుల‌కు చంప‌క్ హిల్స్ వ‌ద్ద రామ‌కృష్ణ మృత‌దేహం క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. రామ‌కృష్ణ హ‌త్య‌లో బచ్చన్నపేటకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జెడ్పి వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి భర్త గిరబైన అంజయ్య పై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఒక భూమి వివాదంలో ఇటీవల రామకృష్ణ అడ్డుకోవడం సహించలేక ఆయన హత్యకు కబ్జాదారులు పథకం పన్నినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

రామ‌కృష్ణ హ‌త్య‌కు సుపారి ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. రామకృష్ణయ్య మర్డర్ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నాయకుడితో పాటు మరో ముగ్గురిని జ‌న‌గామ పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. సీపీ రంగనాథ్ నేతృత్వంలో ఈ కేసుపై పోలీసులు విచారణ జ‌రుగుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా రామకృష్ణ బ్రతికుంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.