Hypnotise | ఫోన్‌లోనే హిప్నటైజ్.. ఖాతా నుంచి రూ.40 వేలు మాయం
విధాత: ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ మోసాలకు గురయ్యే బాధితుల సంఖ్య తగ్గడం లేదు. మోసపోయే వారిలో నిరక్షరాస్యులతో పాటు చదువుకున్నవారు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఓ జర్నలిస్టు సైబర్ మోసం వల్ల రూ.40 వేలు నష్టపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నిందితుడు తనని ఫోన్‌లోనే హిప్నటైజ్ (Hypnotise) చేశాడని బాధితుడు పేర్కొనడమే.. దిల్లీకి చెందిన రమేష్ కుమార్ ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఇటీవల […]

విధాత: ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ మోసాలకు గురయ్యే బాధితుల సంఖ్య తగ్గడం లేదు. మోసపోయే వారిలో నిరక్షరాస్యులతో పాటు చదువుకున్నవారు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఓ జర్నలిస్టు సైబర్ మోసం వల్ల రూ.40 వేలు నష్టపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నిందితుడు తనని ఫోన్‌లోనే హిప్నటైజ్ (Hypnotise) చేశాడని బాధితుడు పేర్కొనడమే..
దిల్లీకి చెందిన రమేష్ కుమార్ ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఇటీవల ఓ సైబర్ నేరగాడి వల్ల తాను రూ.40 వేలు నష్టపోయానని పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదీ కూడా ఒకే సారి కాదు. రూ.20 వేల చొప్పున రెండు సార్లు పంపానని వెల్లడించాడు. పోలీసులు ఆశ్చర్యపోయి మొదటి సారి పంపాక అనుమానం రాలేదా అని అడిగితే.. ఫోన్‌లో ఆ నిందితుడు తనని హిప్నటైజ్ చేశాడని, తన ఆలోచనా శక్తిని క్షీణింపజేశాడని తెలిపాడు.
‘ఆ కాలర్ కి నేను బాగా తెలిసినట్లు మాట్లాడాడు. అలా నన్ను హిప్నటైజ్ చేశాడు. అతడి గొంతు నా స్నేహితుడి గొంతుని పోలి ఉండటంతో నేను నమ్మాను. నువ్వు పలానా యేనా అని అడిగా కూడా.. హా బాగా గుర్తు పట్టావ్ అని అంటూ… సంభాషణ పొడిగించాడు’ అని రమేష్ తెలిపాడు.
పేటీఎంలో లింక్ పంపి ..
మోసం చేయడంలో భాగంగా.. మొదట నీ అకౌంట్‌లో కొంత సొమ్మును డిపాజిట్ చేసి, తర్వాత తీసుకుంటానని కాలర్ రమేష్‌ను అడిగాడు. శాంపిల్‌గా మొదట రూ.2 పంపుతానని చెప్పి రమేష్ బ్యాంకు ఖాతాలోకి పంపాడు.. దానిని వెనక్కి తీసుకోవడానికి ఓ లింక్ పంపుతానని చెప్పి పేటీఎంకు దానిని పంపాడు.
దానిని క్లిక్ చేసిన బాధితుడు.. అది అడిగిన బ్యాంకు పిన్‌ను అందులో పొందుపరిచాడు. వెంటనే అతడి ఖాతా నుంచి రూ.20 వేలు విత్‌డ్రా అయ్యాయి. ఇదేంటని బాధితుడు అడగగా.. పొరపాటున వేరే లింక్ పంపానని, ఇప్పుడు మరో లింక్ పంపుతా అని రెండో సారి లింక్ పంపించాడు. దానిలో వివరాలు ఇవ్వగానే మరో రూ.20 వేలు మాయమయ్యాయి.
అలా కుదరదు..
మార్చి 7న జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించి ఏప్రిల్ 25న ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ కాల్‌లో హిప్నటైజ్ చేయలేరని తెలిపారు. తమను తాము కష్టాల్లో ఉన్న వారిగా నమ్మించి అమాయకుల దగ్గర నుంచి డబ్బు కొట్టేసే పద్ధతిని సైబర్ నేరగాళ్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎంత దగ్గరి వారు మాట్లాడినా బ్యాంకు వివరాలు ఏవీ పంచుకోవద్దని సూచించారు.