Kantara: కాంతార హీరో..యూనిట్ కు తప్పిన ప్రమాదం!

Kantara: సంచలన విజయం సాధించిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1.. సినిమా షూటింగ్ లో హీరో రిషబ్ శెట్టి సహా చిత్ర బృందానికి పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషబ్ శెట్టితో పాటు 30మంది నటీ నటులు, సిబ్బంది బోటులో ఉన్నారు. నీటిలో బోటు తిరగబడగానే రిషబ్ సహా అందులో ఉన్న వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కెమెరాతోపాటు పలు సాంకేతిక పరికరాలు నీటి పాలయ్యాయి.
వరుస ప్రమాదాలతో భయపెడుతున్న కాంతార
కన్నడ నటుడు రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార సినిమా 2022లో విడుదలై సంచలన విజయం సాధించింది. భూతకోలా, కంబాళ, పంజుర్లి సన్నివేశాలు సినిమా విజయానికి దోహదం చేశాయి. దీంతో రిషభ్ స్వీయ దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్ 1’ భారీ అంచనాల మధ్య నిర్మాణం జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వరుస ప్రమాదాలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది. గతేడాది నవంబర్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌లు ప్రయాణిస్తున్న వ్యాన్‌కు ప్రమాదం చోటు చేసుకుంది. 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. మే నెల 12న కపిల్ అనే నటుడు నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. అదే నెలలో రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో కన్నుమూశాడు. జూన్ 13న జూనియర్ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) సైతం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.
కాంతార టీమ్ కు ఎందుకిలా జరుగుతోంది?
కాంతార చిత్ర యూనిట్ ను వరుస ప్రమాదాలు ఎందుకు వెంటాడుతున్నాయి..ఇలా ఎందుకు జరుగుతోంది? వరుసగా టీమ్ మెంబర్స్ ఎందుకు చనిపోతున్నారంటూ కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. చాలా మంది వీటిని పంజుర్లి దేవుని హెచ్చరికలే నంటూ అభిప్రాయపడుతున్నారు. కాంతార ఛాప్టర్ 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్‌లో జరిగిన వార్షిక ఉత్సవాలకు వెళ్లాడు. అక్కడ పండగ చివరిలో పంజుర్లి పూనిన పూజారి రిషబ్ తో మాట్లాడుతూ ‘నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు. భారీ కుట్రకు తెర తీశారు. నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు’ అని చెప్పాడు. దీంతో రిషబ్ తో పాటు అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వారాహి పంజుర్లి హెచ్చరికలే నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయన్న వాదన కూడా వినిపిస్తుంది.