Karimnagar | హామీలు నెరవేర్చాకే.. మంత్రి గంగుల ఓట్లు అడగాలి: సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
Karimnagar ఖాజీపేట వక్ఫ్ భూములు అప్పగించాలి ఈద్గా భూవివాదం పరిష్కరించాలి ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఓవైసీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం విధాత బ్యూరో, కరీంనగర్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాకనే.. మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ ఓట్లు అడగాలని, ముస్లింల ఓట్లతో గెలిచి ముస్లిం సమాజానికి గంగుల ఏం ఒరగబెట్టారని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మండిపడ్డారు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ […]

Karimnagar
- ఖాజీపేట వక్ఫ్ భూములు అప్పగించాలి
- ఈద్గా భూవివాదం పరిష్కరించాలి
- ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
- ఓవైసీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం
విధాత బ్యూరో, కరీంనగర్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాకనే.. మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ ఓట్లు అడగాలని, ముస్లింల ఓట్లతో గెలిచి ముస్లిం సమాజానికి గంగుల ఏం ఒరగబెట్టారని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మండిపడ్డారు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు నగరంలోని 47వ డివిజన్లో, డివిజన్ సందర్శన, హాలాతే హజిరా కార్యక్రమం కార్పొరేటర్ షర్ఫుద్ధిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతు మంత్రి గంగుల ముస్లిం సమాజం పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో సర్వే నంబర్ 126, 129, 154, 171 లో 55 ఎకరాల 24 గుంటల వక్ఫ్ బోర్డు భూమి ఉందని, ఈ భూమిలో నుంచి సుమారు 11ఎకరాల వక్ఫ్ భూమి మంత్రి గంగుల కమలాకర్ ఆధీనంలో ఉందని, ఈ భూమిలో మంత్రి ఫామ్ హౌజ్ కట్టుకొని, వందల కోట్ల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు.
సదరు భూమి వక్ఫ్‌దని తేలితే, మరో 5ఎకరాలు కలిపి వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తానని మాటిచ్చారన్నారు. వక్ఫ్ బోర్డు ఆ భూమి తమదేనని తేల్చిందని, అయినప్పటికీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గా గంగుల బాధ్యతాయుతమైన హోదాలో ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే, రెవెన్యూ ద్వారా చేసిన తప్పుడు రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఈ అంశం కరీంనగర్ ముస్లిం సమాజాన్ని విస్మయానికి గురి చేసిందన్నారు.
తమ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఈ భూమి విషయంలో ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు విచారణ చేసి స్వాధీనం చేసుకోవాలని లేఖ రాశారని గుర్తు చేశారు. తక్షణమే వక్ఫ్ బోర్డు భూమిని, మంత్రి ఇస్తానన్న 5ఎకరాలు కలిపి అప్పగిస్తే, మిగతా భూమి సైతం వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటుందన్నారు.
చింతకుంటలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏళ్ల తరబడి నిర్మాణం దశలోనే ఉందన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా కనుగుణంగా ఖబరస్థాన్ కోసం మరో పదెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లలో ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు అందించడానికి మంత్రి గంగుల తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు.
నగరంలోని పద్మ నగర్ వద్ద పాల డెయిరీ పక్కన ప్రభుత్వ భూమిలో 25 ఎకరాల స్థలాన్ని ఈద్గా కోసం కేటాయించాలని లేకుంటే ఉద్యమం తప్పదన్నారు. మంత్రి గంగుల ఇటీవలే ముకరంపురలో కొందరు ముస్లిం పెద్దల సమక్షంలో కొత్తపల్లి శివారులో ఏడెకరాల స్థలాన్ని ఈద్గా కోసం కేటాయిస్తున్నామని చెప్పి చేయలేదన్నారు. రేకుర్తిలో పేద ముస్లింల ఇండ్లను కూల్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, వారిపై ఎందుకు ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు.
పేద ముస్లింల కూల్చిన ఇండ్ల స్థానంలో డబుల్ బెడ్ రూములను ప్రభుత్వం ద్వారా కట్టివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉన్న ఉర్దూ కరీంనగర్ లో అమలు కావడం లేదని, అసలు కరీంనగర్ తెలంగాణలో ఉందా యూరప్ లో ఉందా అని ఎద్దేవా చేశారు. స్మార్ట్ సిటీ కాలనీలా సూచికల బోర్డులపై ముస్లిం కాలనీల పేర్లు ఎందుకు వ్రాయడం లేదని ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ద్వారా అనుకూల ఫలితాలు వచ్చాయో మంత్రి ఆలోచించుకోవాలని, మంత్రి నమ్మిన వారి డివిజన్లో ఎందుకు ఓట్లు తక్కువ వచ్చాయో గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలన్నారు. కరీంనగర్ లో ఎంపీ ఓగుడి నిర్మాణం చేశారని చెప్పి, మంత్రి తాను ఇంకొక గుడి నిర్మాణం చేస్తుంటే తమకు అభ్యంతరం లేదని, ఓట్లేసి గెలిపించిన ముస్లిం సమాజానికి ఏం ఓరగబెట్టారన్నారు.
ముస్లింలకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్మనగర్ పాల డెయిరీ వద్ద 25 ఎకరాల స్థలాన్ని ఈద్గా కోసం కేటాయిస్తే, అట్టి భూమిలో కేసులు వేయించి, ఇబ్బందులు సృష్టించిన వారు ఎవరో ముస్లిం సమాజానికి వివరిస్తామని, వారిని చైతన్య పరుస్తామని, ప్రతి ఇంటికి పాంప్లెట్ లను నివేదిక ద్వారా కూలంకశంగా చేరవేస్తామన్నారు.
ఇప్పుడు అదే స్థలంలో గుడి కడుతున్నారని, మరి ఇప్పుడెందుకు కేసులు వేయడం లేదని, ఇందులో ఎవరి పాత్ర ఉందో ముస్లిం సమాజానికి అర్థం అవుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 35 డివిజన్లో తమ పార్టీ బలంగా ఉందని, తమ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తాము పోటీకి చేయడానికి సిద్ధమన్నారు.
ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరితే, మద్దతు అనివార్యమైతే, పైన పేర్కొన్న అంశాలన్నింటినీ తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎదుట, సీఎం కేసీఆర్ ఎదుట ప్రస్తావించాకే పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
బిఆర్ఎస్ పార్టీతో తాము ఫ్రెండ్లీ పార్టీగా ఉంటే స్థానికంగా ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని, గంగుల ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటే, తాము తమ ప్రజలకు ఏవిధంగా జవాబు చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ వేదిక ద్వారా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు సయ్యద్ మొయిజుద్దీన్ ఖాదిరి యూసుఫ్, సయ్యద్ ఖమరుద్దీన్, ఖాజా, కోశాధికారి ఇబ్రహీం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అఖీల్ ఫిరోజ్, కార్పొరేటర్లు షర్ఫుద్దీన్, ఆతిన, అలీ బాబా, అజర్ దబీర్, 35 డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, 47వ డివిజన్ ప్రజలు, ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు.