Karimnagar | నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు.. లక్ష రూపాయల విత్తనాలు స్వాధీనం
Karimnagar విధాత, కరీంనగర్ బ్యూరో: ఎటువంటి లైసెన్సులు లేకుండా నకిలీ లేబుళ్లు అంటించి నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులు సుల్తానాబాద్ కు చెందిన నూక రాజేశం (40), వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన ఇరుకుల్ల వేద ప్రకాష్ (54) లను మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, మానకొండూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల విలువగల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. […]

Karimnagar
విధాత, కరీంనగర్ బ్యూరో: ఎటువంటి లైసెన్సులు లేకుండా నకిలీ లేబుళ్లు అంటించి నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులు సుల్తానాబాద్ కు చెందిన నూక రాజేశం (40), వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన ఇరుకుల్ల వేద ప్రకాష్ (54) లను మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, మానకొండూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల విలువగల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమీషనర్ ఎల్.సుబ్బారాయుడు మాట్లాడుతూ నూక రాజేశం, ఇరుకుల్ల వేద ప్రకాష్ (54), సతీష్ లు ఒక ముఠాగా ఏర్పడి కల్తీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరి కదలికలపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ విభాగం, మానకొండూరు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు వద్ద నిఘా ఉంచి టీఎస్ 03 ఈఎల్ 7185 కారులో అక్రమంగా రవాణా చేస్తున్న విత్తనాలతో ఇద్దరిని పట్టుకున్నారు. వీటి విలువ ఒకలక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
సతీష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలో అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. అధిక దిగుబడులు వస్తాయని ఆశ చూపుతూ రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి విజయ సారధి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, యం రవికుమార్, మానకొండూరు సిఐ రాజ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.