Karnataka Elections | BJP ఫస్ట్ లిస్టులో.. సీనియర్లు ఔట్
నలుగురికి చాన్స్ ఇవ్వని అధిష్ఠానం జాబితాలో 50కి పైగా కొత్త వారి పేర్లు నాకంటే గొప్పోళ్లు ఎవరున్నారన్న షెట్టర్ బొచ్చ పట్టుకుని తిరగలేనన్న లక్ష్మణ్ ఎన్నికల ముందు అసలే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పడు టికెట్‌ల కేటాయింపు వ్యవహారం కొత్త తలనొప్పులు తెప్పిస్తున్నది. ఏప్రిల్ 10న జరిగే ఎన్నికలకు తొలి లిస్టును బీజేపీ బుధవారం విడుదల చేసింది. అయితే అందులో కొందరు సీనియర్లను పక్కనపెట్టడం వివాదానికి దారి తీస్తున్నది. విధాత: పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే […]

- నలుగురికి చాన్స్ ఇవ్వని అధిష్ఠానం
- జాబితాలో 50కి పైగా కొత్త వారి పేర్లు
- నాకంటే గొప్పోళ్లు ఎవరున్నారన్న షెట్టర్
- బొచ్చ పట్టుకుని తిరగలేనన్న లక్ష్మణ్
ఎన్నికల ముందు అసలే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పడు టికెట్‌ల కేటాయింపు వ్యవహారం కొత్త తలనొప్పులు తెప్పిస్తున్నది. ఏప్రిల్ 10న జరిగే ఎన్నికలకు తొలి లిస్టును బీజేపీ బుధవారం విడుదల చేసింది. అయితే అందులో కొందరు సీనియర్లను పక్కనపెట్టడం వివాదానికి దారి తీస్తున్నది.
విధాత: పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే పేరుతో సీనియర్లకు టికెట్ నిరాకరించడం ఇప్పడు కర్ణాటక బీజేపీలో కొత్త వివాదానికి తెర తీసింది. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని చెప్పడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తీవ్రంగా స్పందించారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే లక్ష్మణ్‌సావడి ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. అదే బాటలో మరో మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పన్‌గౌడ పాటిల్ నరిబోల్ కూడా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
టికెట్ లభించని మంత్రి ఎస్ అంగర పార్టీని వీడుతానంటూ బెదిరింపులకు దిగారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని చేసిన ప్రకటన ఆయన సొంత జిల్లాలో నిరసనలకు దారి తీసింది. అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులేమీ లేవని అధిష్ఠానం చెబుతున్నా.. రాష్ట్ర నాయకత్వం చేసిన అనేక సిఫారసులను పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.
షెట్టర్ తిరుగుబాటు
మొదటి జాబితాలో నలుగురు సీనియర్లను బీజేపీ పక్కన పెట్టింది. అదే సమయంలో 52 కొత్త పేర్లు దర్శనమిచ్చాయి. టికెట్ రానివారిలో ప్రముఖుడైన జగదీశ్ షెట్టర్‌కు ప్రస్తుతం 67 సంవత్సరాలు. ఆరు పర్యాయాలు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చట్టసభ సభ్యుడిగా తన రికార్డు, తనకు ఉన్న క్లీన్ ఇమేజ్, రాష్ట్రంలో పార్టీని నిర్మించడంలో తన కృషిని ప్రస్తావించిన షెట్టర్.. ఈ నిర్ణయం తనను చాలా బాధించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని అధిష్ఠానానికి చెప్పానని, అయినా ఫలితం లేకపోయిందని మీడియాతో అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. మాజీ సీఎంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. జగదీశ్ షెట్టర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫోన్‌లో మాట్లాడారు.
రాజీ పడిన ఈశ్వరప్ప
ఈశ్వరప్ప మాత్రం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఒక ఉత్తరం రాస్తూ.. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. పార్టీ ఇప్పటికే గత 40 ఏళ్లలో తనకు అనేక బాధ్యతలు ఇచ్చిందని, ఇక తాను ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానని పేర్కొన్నారు. దీనిపై శివమొగ్గలోని ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.
యడ్యూరప్పకూ అసంతృప్తి?
ఇప్పటికే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, కీలక పక్షం జేడీఎస్‌లు తొలి జాబితాలు విడుదల చేశాయి. కానీ.. బీజేపీ నాన్చుడు ధోరణిని అనుసరించి.. ఇప్పటికి జాబితా వెలువరించింది. జాబితా రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో అప్పటికే పలువురు ఆశావహులు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిసి విన్నపాలు చేసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న యడ్యూరప్ప అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తున్నది. పార్టీ హైకమాండ్ టికెట్లు ఇచ్చిన తీరుతో ఆయన మనస్తాపానికి గురయ్యారని సమాచారం. కానీ.. తాను చేసిన అనేక సూచనలను పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నదని మంగళవారం ఆయన మీడియాకు చెప్పారు.
అయినా పోటీ చేస్తానంటున్న షెట్టర్
హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నుంచి తాను పోటీ చేసి తీరుతానంటూ లింగాయత్ నేత అయిన జగదీశ్ షెట్టర్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. రాష్ట్రంలో మెజార్టీ జనాభా లింగాయత్‌లదే. మొత్తం జనాభాలో వారు 17శాతం ఉంటారు. ‘టికెట్ ఇవ్వడం లేదని రెండు మూడు నెలల ముందే చెప్పి ఉంటే గౌరవప్రదంగా ఉండేది. నామినేషన్లకు రెండు రోజుల ముందు చెప్పడం నన్ను నిజంగా బాధించింది. నేను పోటీ చేస్తానని వారికి చెప్పాను. మీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు.. పునఃపరిశీలించండి’ అని చెప్పానని తెలిపారు.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. బీజేపీ నుంచి జాబితాలు వస్తాయనుకుంటే.. ఆ పార్టీ నేతలు బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించింది. టికెట్లు ప్రకటనకు బదులు.. వికెట్ల పతనం కనిపిస్తున్నదని ఎద్దేవా చేసింది. ఈశ్వరప్ప రాజీనామా ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. వందలాది మంది కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నినాదాలు చేస్తూ.. టైర్లను తగలబెట్టారు.
బొచ్చ పట్టుకుని తిరగలేను: లక్ష్మణ్
‘నా నిర్ణయం నేను తీసుకున్నాను. బొచ్చ పట్టుకుని తిరిగే రకం కాదు నేను. ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నాయకుడిని. ఎవరి ప్రభావంలోనో నేను లేను’ అని లక్ష్మణ్ సావడి చెప్పారు. అయితే.. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న వాదన వినిపిస్తున్నది. లక్ష్మణ్ సావడి మాజీ సీఎం యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. నలుగురు ప్రముఖులకు టికెట్లు నిరాకరించడమే కాకుండా.. అనేక మందికి మరోసారి అవకాశం లభించక పోవడంతో బీజేపీలో అసమ్మతి రాజుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.