Karnataka MP | ద‌క్షిణ భార‌త్‌ను ప్ర‌త్యేక దేశంగా ప్ర‌క‌టించాలి..

క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎంపీ, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేశ్ తాజాగా ప్ర‌త్యేక దేశం డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చారు

Karnataka MP | ద‌క్షిణ భార‌త్‌ను ప్ర‌త్యేక దేశంగా ప్ర‌క‌టించాలి..

Karnataka MP | న్యూఢిల్లీ : క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎంపీ, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేశ్ తాజాగా ప్ర‌త్యేక దేశం డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చారు. ద‌క్షిణ భార‌త్‌ను ప్ర‌త్యేక దేశంగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. నిన్న నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌పై డీకే సురేశ్ స్పందించారు.


ఈ బ‌డ్జెట్‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్ర‌భుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సురేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలను, ప్రజలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం విధానాలు అవలంభిస్తే.. త్వరలోనే ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తామని ఆయ‌న కేంద్రాన్ని హెచ్చ‌రించారు.


దక్షిణ భారతదేశంలో వసూలు చేస్తున్న జీఎస్టీ పన్నులు ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు నిధుల రూపంలో పంపిణీ చేయడం సరికాదన్నారు డీకే సురేశ్‌. దేశంలోని వివిధ రాష్ట్రాలకు నిధుల పంపిణీ చూస్తుంటే.. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ఆ సొమ్ము మ‌ళ్లిస్తున్న‌ట్లు స్పష్టమవుతోందన్నారు. క‌ర్ణాట‌క నుంచి కేంద్రాన్ని ప‌న్నుల రూపంలో రూ. 4 ల‌క్ష‌ల కోట్లు చెల్లిస్తున్నామ‌ని, కానీ కేంద్రం నుంచి మాత్రం చాలా త‌క్కువ నిధులు వ‌స్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఈ అంశంపై ప్ర‌తి ఒక్క‌రూ దృష్టి సారించాల‌ని ఆయ‌న సూచించారు. ఒక వేళ ద‌క్షిణాది రాష్ట్రాల‌ను కేంద్రం నిర్ల‌క్ష్యం చేస్తే.. ద‌క్షిణాన ఉన్న రాష్ట్రాలను ప్ర‌త్యేక దేశంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేయాల‌న్నారు డీకే సురేశ్‌.


డీకే సురేశ్ వ్యాఖ్య‌ల‌పై క‌ర్ణాట‌క బీజేపీ అధ్య‌క్షుడు బీవై విజ‌యేంద్ర ధ్వ‌జ‌మెత్తారు. డీకే సురేశ్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, ఐక్య‌త‌ను కాపాడుతాన‌ని ప్ర‌మాణం చేసిన ఏ ప్ర‌జాప్ర‌తినిధి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రు అని ఆయ‌న అన్నారు. బ‌హుషా ఆయ‌న ఎంపీగా ప్ర‌మాణం చేసిన క్ష‌ణాల‌ను మ‌రిచిపోయిన‌ట్లు ఉన్నార‌ని విమ‌ర్శించారు. సురేశ్ బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు.