Karnataka | కర్ణాటకలో మళ్లీ ‘దళిత సీఎం’ దుమారం!
నేనెందుకు సీఎం కాకూడదు? దళితులను ఎదగనీయడం లేదు పెద్దోళ్లమని చెప్పుకొంటున్నవాళ్లకి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర అప్పుడే మంత్రివర్గంలో చిచ్చు! 2013లో సీఎం సీటు దక్కని పరమేశ్వర అప్పటి నుంచి అసంతృప్తితోనే బెంళూరు: ముఖ్యమంత్రి విషయంలో సుదీర్ఘ మంతనాలు జరిపి, సీఎం రేసులో గట్టిగా నిలిచిన డీకే శివకుమార్‌ను కాదని.. సిద్ధరామయ్యను ఆ పదవిలో కూర్చొనబెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానానికి మరో సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. కర్ణాటక (Karnataka) ఎన్నికలు ముగిసి […]

- నేనెందుకు సీఎం కాకూడదు?
- దళితులను ఎదగనీయడం లేదు
- పెద్దోళ్లమని చెప్పుకొంటున్నవాళ్లకి
- ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర
- అప్పుడే మంత్రివర్గంలో చిచ్చు!
- 2013లో సీఎం సీటు దక్కని పరమేశ్వర
- అప్పటి నుంచి అసంతృప్తితోనే
బెంళూరు: ముఖ్యమంత్రి విషయంలో సుదీర్ఘ మంతనాలు జరిపి, సీఎం రేసులో గట్టిగా నిలిచిన డీకే శివకుమార్‌ను కాదని.. సిద్ధరామయ్యను ఆ పదవిలో కూర్చొనబెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానానికి మరో సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది.
కర్ణాటక (Karnataka) ఎన్నికలు ముగిసి నెల కూడా కాకముందే రాష్ట్ర హోం మంత్రి, దళిత నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కాకపుట్టించే వ్యాఖ్యలు చేశారు. దళిత సీఎం అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ‘2013లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీని అధికారంలోకి తెచ్చినా కూడా నాకు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు.
అయితే.. నా ఆధ్వర్యంలో విజయం సాధించినా.. ఆ క్రెడిట్ నాకు ఇవ్వలేదు. నేను కూడా చెప్పుకోలేదు. దళితులను నిర్లక్ష్యం చేయడం వల్లే 2018లో పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. పెద్ద నాయకులుగా చెప్పుకొంటున్న వారు దళిత సమాజాన్ని నిర్లక్ష్యం చేశారు. వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి’ అని పరమేశ్వర అన్నారు. బెంగళూరులోని అంబేద్కర్ భవన్‌లో వివిధ దళిత గ్రూపులు కలిసి ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
పార్టీలో ఉద్దేశపూర్వకంగానే దళితులకు ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదని ఆయన ఆరోపించారు. ‘నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? పోనీ.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప ఎందుకు కాకూడదు? ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప ఎందుకు సీఎం కాకూడదు?’ అని పరమేశ్వర ప్రశ్నించారు. ‘మనం ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి.. ఐక్యం కావాలి’ అని దళిత నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌లో కలకలం
దళిత నేత పరమేశ్వర చేసిన సంచనల వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగించేదేనని, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి. పరమేశ్వర వ్యాఖ్యలు పార్టీలో ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఒక నాయకుడు అన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ వెంట నిలిచాయి. ప్రత్యేకించి రానున్న లోక్‌సభ, బెంగళూరు నగరపాలిక ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఓటు బ్యాంకును కోల్పోవడానికి పార్టీ సిద్ధంగా లేదని ఆయన చెప్పారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎంగా ఎవరు ఉండాలన్న అంశంపై పీటముడి పడిన సంగతి తెలిసిందే. నేనంటే నేను అంటూ అటు డీకే శివకుమార్, ఇటు సిద్ధరామయ్య భీష్మించుకుని కూర్చున్నారు. చెరో రెండున్నరేళ్లు ఇస్తామని అధిష్ఠానం ప్రతిపాదించినా.. ఇస్తే ఫుల్ టైమ్ సీఎం లేదంటే లేదు అని డీకే శివకుమార్ తెగేసి చెప్పారు.
మొత్తం మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు డీకేను ఒప్పించి.. సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించారు. వారిద్దరి మధ్య సయోధ్య బలంగానే ఉండటంతో ప్రతిపక్ష బీజేపీ గేమ్‌ప్లాన్ అమలు చేసే అవకాశం రాలేదు. పరమేశ్వర ప్రముఖ దళిత నాయకుడు. మొదటి నుంచీ పార్టీకి విధేయతతోనే పని చేస్తున్నారు. 2013లో పరమేశ్వర ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉండకుండా చూసేందుకు సిద్ధరామయ్యే ఆయనను ఓడించారని రాజకీయవర్గాల్లో అప్పట్లో చర్చలు జరిగాయి.
ఓటమి చవిచూడటంతో ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిని పరమేశ్వర ఆశించలేదు. అప్పటి నుంచీ పరమేశ్వర అసంతృప్తితోనే ఉన్నారని, తనకు జరిగిన ద్రోహాన్ని ఇప్పటికీ మర్చిపోలేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. కర్ణాటకకు ఇంత వరకూ దళిత ముఖ్యమంత్రి లేరు. గతంలో మల్లికార్జున ఖర్గే కూడా దరిదాపుల్లోకి వచ్చి.. ఆ అవకాశాన్ని కోల్పోయారు.