కేసీఆర్ వైఖరితోనే గిరిజన మ్యూజియంలో ఆలస్యమైంది
గత కేసీఆర్ ప్రభుత్వ వైఖరి కారణంగా తెలంగాణాలో గిరిజన మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర పర్యాటట, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు

- శంకుస్థాపనలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : గత కేసీఆర్ ప్రభుత్వ వైఖరి కారణంగా తెలంగాణాలో గిరిజన మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర పర్యాటట, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ అబిడ్స్‌లో రాంజీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు కేంద్రం ఎన్ని లేఖలు రాసినా గిరిజన మ్యూజియం విషయంలో స్పందించ లేదని, ఇవాళ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారని కొనియాడారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, దీనికి కూడా గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు.
గిరిజన వర్సిటీకి మొదటి విడతలో రూ.900 కోట్లు కేటాయించామని, రూ.420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణాలో ప్రారంభించామన్నారు. మేడారం జాతరకు రూ.3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నామన్నారు, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలేదని
రాష్ట్రం నుంచే కాంగ్రెస్‌కు నిధులు
కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ నుంచే నిధులు అందుతున్నాయని, ఇక్కడి పాలకులు రాహుల్‌గాంధీ ఆదేశాలకు తలొగ్గి కాంట్రాక్టర్లను, పారిశ్రామిక సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నేత వెల్లాల రామ్మోహన్ బీజేపీలో చేరగా, ఆయనకు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, కుటుంబ పాలనలలో కాంగ్రెస్, బీఆరెస్‌లు నాణేనికి బొమ్మా బొరుసులాంటివని.. ఆ రెండు పార్టీలు మజ్లిస్ అడుగుజాడల్లో పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. భద్రాచలం ఆలయం కోసం మోడీ ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు కేటాయించారని, ఆయన కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అతి ప్రాచీన, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు.