వికసిత్ భారత్ పేరుతో… కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
‘వికసిత్ భారత్’ పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ మనువాది భారత్‌ను నిర్మిస్తోందని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. బీహార్ ఎన్నికలు ఫార్స్ అని పేర్కొంటూ, ప్రతిపక్షాలు, ప్రజలు ఆర్ఎస్ఎస్-బీజేపీ ఫాసిస్టు పాలసీలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాబోయే కాలంలో ప్రజలు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, సంఘాల నుండి చెలరేగే ఆందోళనలను కఠినంగా అణచివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. వికసిత్ భారత్ (కార్పొరేట్) నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని మనువాదుల ప్రభుత్వం మోదీ, అమిత్ షాల నాయకత్వన నవంబర్ 28,29,30 తేదీలలో చత్తీస్ గడ్ రాయపూర్ పట్నంలో డీజీపీల, పారామిలటరీ దళాల అధిపతుల, ఇంటెలీజెన్సీ విభాగాల సమావేశం నిర్వహించారని ఇందులో పోలీస్ వ్యవస్థలు బలోపేతమై అణిచివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 11 సంవత్సరాలుగా మనువాదులు అమృత్ కాల్, ఆత్మనిర్భర్ భారత్, నయా భారత్, శేష్ఠ భారత్, ఏక్ భారత్, వికసిత్ భారత్ అంటూ ఎల్.పీ.జీ పాలసీలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు కార్పొరేట్ సంస్థల సంపద పెరుగుతూ ఉండగా ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయన్నారు.
అన్నివర్గాల మీద అణిచివేత
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని జపిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ ఎజెండా లోని అంశాలను పాలసీలుగా, చట్టాలుగా తెచ్చి అమలు జరుపుతున్నారని, అన్ని వర్గాల మీద, అన్ని పార్టీల మీద, ప్రగతిశీల శక్తుల, ప్రజాస్వామిక వాదుల, బహుజనుల, దళితుల, ఆదివాసుల మీద దాడి తీవ్రంగా కొనసాగుతోందన్నారు.
బీహార్ ఎన్నికలు ఫార్స్
ఇటీవల బిహార్ ఎన్నికలు ఒక ఫార్స్ అని నిరూపించాయి. ఎన్నికలలో తాము ఏ విధంగానైనా గెలువగలమని, ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు ఎంత ఉన్నప్పటికి ఓడించగలమని నిరూపించారని పేర్కొన్నారు. వాస్తవానికి బిహార్ లో ఎన్నికలకు ముందు ప్రజల మూడ్ ప్రతిపక్షాలకు చాలా అనుకూలంగా వుందనేది అనేక క్షేత్ర స్థాయి పరిశీలకులు చెప్పారు. కానీ ఫలితాలు దానికి చాలా భిన్నంగా వచ్చాయన్నారు. భారత దేశంలో ఎలక్షన్ కమీషన్, కోర్టులు, CBI, NIA, ED, SEBI, UGC, విజిలెన్స్ కమీషన్, CAG ఇంకా అన్ని సంస్థలు పూర్తిగా బీజేపీ నియంత్రణలోకి వెళ్లిపోయాయన్నారు. త్వరలో 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను, మంత్రులను తొలగించే కార్యక్రమం కూడా చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ లో ఎస్.ఐ.ఆర్ జరిపి ఎన్నికలు నిర్వహించి గెలుపొందారు. హర్యానా, మహారాష్ట్రలలో ఎస్.ఐ.ఆర్. జరపకుండా కూడా ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు. ఏ విధంగానైనా కూడా తాము గెలుస్తామని నిరూపిస్తున్నారు. ఈ రకంగా ప్రతిపక్ష పార్టీలలో నిరాశను తీసుకువచ్చి విచ్ఛిన్నం చేసే విధంగా వారి వ్యవహార ధోరణి వున్నదన్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంటరీ పార్టీలు ప్రజల్లోకి పోయి వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీహార్ ఎన్నికల అనంతరం శ్రమ శక్తి నీతి-2025 పేరుతో నాలుగు కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చారని విమర్శించారు. చౌకగా శ్రమను దోచుకోవడం, పని గంటలు పెంచడం, చట్టబద్ధ హక్కులను రద్దు చేయడం, సంఘ నిర్మాణం, సమ్మె హక్కుకు ఆటంకాలు కల్పించడం, కార్మికుల తొలగింపును యాజమాన్యపు ఇష్టానికే వదిలి వేయటం వంటి మార్పులు చేశారని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని 14,16,23 ఆర్టికల్స్ ను ఉల్లంఘిస్తుందని, ఈ విధంగా సుమారు 50 కోట్లుగా ఉన్న సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం మీద దాడిని తీవ్రతరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కార్మికోద్యమాన్ని బలహీనపర్చి, విచ్ఛిన్నం చేసేందుకు మనువాదులు ఈ కోడ్ లను తెచ్చారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాల్లో అణుశక్తి వినియోగం, నియంత్రణకు సంబంధించిన అణుశక్తి బిల్-2025 (atomic energy bill) ద్వారా అణుశక్తి ఉత్పాదనను, పంపకాన్నీ ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పబోతున్నారు. ఆదివాసీ, దళిత, వెనకబడిన వర్గాల, అగ్రకులాలలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండ చేసేందుకు UGC, AICTE, NCERT లను రద్దు చేసి విద్యా కమీషన్ ను (హిందూస్థాన్ ఎజ్యుకేషన్ కమీషన్) ఏర్పాటు చేయబోతున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లు ను ప్రవేశ పెట్టి విద్యుత్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేయబోతున్నారు. బ్యాంకులను విలీనం చేసి వాటిని కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయబోతున్నారన్నారు.
దేశ ఆర్థికవ్యవస్థ మార్కెట్ చేతుల్లో బందీ
దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్య పెట్టుబడి కంపెనీల, మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయ్యి ఉన్నది. విదేశీ మదుపరులు షేర్ మార్కెట్ లోని తమ పెట్టుబడులను విదేశాలకు తరలించుకు పోవడం మరియు ట్రంప్ మన ఎగుమతుల మీద భారీగా సుంకాలు విధించడం వంటి కారణాల వలన రూపాయి విలువ మరింత పతనమై ఒక డాలర్ కు 90.15 రూపాయలుగా పడిపోయింది. దీని వలన పెట్రోల్, డీజల్, వంట నూనేలు, ఎల్.పీ.జీ ధరలు పెరిగి పేద, మధ్యతరగతి వర్గం మీద భరించలేని భారం పడనున్నది.
భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో భాగంగా మోదీ ప్రభుత్వం ట్రంప్ కు లొంగిపోయి అమెరికా నుండి పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ మొదలగు పంటలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని వలన ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన మన దేశ రైతాంగం పరిస్థితి మరింత దిగజారనున్నది. దీని వలన తెలంగాణలోని పత్తి రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం కూడా పత్తి కొనుగోల్లు సీ.సీ.ఐ. చేపట్టడం లేదు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ మీద వత్తిడి తెచ్చి అదానీ కంపెనీలలో 45 వేల కోట్ల రూపాయల షేర్లను కొనిపించింది. ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు కార్పొరేట్ల కంట్రోల్ లోకి పోతున్నదన్నారు.
దళిత, గిరిజన వర్గాల పై దాడులు
మరో వైపున ఆర్.ఎస్.ఎస్.-బీ.జే.పీ పాలిత రాష్ట్రాలలో ఆదివాసీ, దళిత మరియు ఇతర పేద కులాల ప్రజల మీద దాడులు పెరుగుతున్నాయని జగన్ విమర్శించారు. వర్ణ వ్యవస్థ-కుల వ్యవస్థ-మనువాద భావజాలాన్ని సనాతన ధర్మం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దాడులు చేయిస్తున్నారు. కుల వ్యవస్థ భారత దేశంలో ప్రగతిశీల పాత్రను పోషించిందని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ను కూడా దాఖలు చేసిందన్నారు. ఈ విధంగా మనువాదులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, బరితెగించి దాడులు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం IAS, IPS, క్లాస్ 1 అధికారులను లొంగదీసుకొని తమ ఎజెండాను అమలు జరిపే విధంగా తయారు చేస్తున్నారు. మాట వినని అధికారులను అవినీతి ఆరోపణలు, ఇతర కారణాలు చెప్పి ఈ 11 సంవత్సరాల కాలంలో 1500 లకు పైగా అధికారులను సర్వీస్ నుండి తొలగించారు. ఎంతో మంది మీద కేసులు పెట్టారు. రకరకాలుగా వేధించారు. దళితుడైన హర్యానా IPS అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఈ పరిస్థితులకు ఒక ఉదాహరణ. మనువాదుల ఎజెండాను అమలు జరుపుటకు ఇష్టం లేని అధికారులు రాజీనామాలు చేసి సర్వీస్ నుండి వైదొలుగుతున్నారు. కాబట్టి దళిత, బలహీన వర్గాల ఉన్నత ఉద్యోగులు నేడు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను మనువాదుల ఎజెండాను అమలు జరిపి ప్రజా వ్యతిరేకులుగా తయారవటమా? లేక ప్రజా పక్షం వహించి నిలబడటమా అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ఉండి పని చేయాలని కోరుతున్నామన్నారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న కారణంగా కార్మికులు, రైతాంగం, విద్యార్థులు, మేధావులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, సంఘాలు, అన్ని పార్టీలు ఈ ఆధునిక మనువాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని జగన్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి :
Smriti Mandhana Cancels Wedding With Palash Muchhal: నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
Praja Palana Vijayotsavam Celebrations : ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram