Praja Palana Vijayotsavam Celebrations : ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్

ప్రజాపాలన విజయోత్సవాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల విజయాలు చెబుతుంటే, అదే డిసెంబర్ 9న బీఆర్ఎస్ విజయ్ దివాస్ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

Praja Palana Vijayotsavam Celebrations : ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో రెండేళ్లు పూర్తి చేసుకుంది. రెండేళ్ల తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవం పేరిట పార్టీ పరంగా..ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలను కొనసాగిస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగిస్తూ ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలలో ప్రసంగిస్తూ ప్రభుత్వ విజయాలను..అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతున్నారు. పనిలో పనిగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శల దాడిచేస్తూ..సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. విజయోత్సవాలలో రాష్ట్ర సాంస్కృతిక చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాలను 33 జిల్లాల్లోని కలెక్టరేట్ల ఆవరణలోనూ డిసెంబర్ 9వ తేదీన ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. గతేడాది డిసెంబర్‍ 9న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍లోని సెక్రటేరియట్ లో 20అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కలెక్టరేట్ లలో ఆవిష్కరించే విగ్రహం 12 అడుగులు, పీఠం 2 అడుగులు, దిమ్మె 4 అడుగులతో కలిపి మొత్తంగా 20 అడుగుల ఎత్తు ఉండనుంది. మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను కూడా ఇదే సందర్బంగా ప్రభుత్వం నిర్వహిస్తుండటం విశేషం.

బీఆర్ఎస్ విజయ్ దివాస్ ఉత్సవాలకు పిలుపు

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివాస్’గా జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చారిత్రాత్మక ‘విజయ్ దివాస్ ‘సంబరాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 29న ‘దీక్షా దివాస్’ను విజయవంతం చేసినట్లుగానే..కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివాస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే విజయ్ దివాస్ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

డిసెంబర్ 9న నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని, పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తుచేయాలని సూచించారు. హైదరాబాద్‌లో నిమ్స్, గాంధీ ఆసుపత్రిలలో నగర బీఆర్ఎస్ నాయకత్వం పండ్ల పంపిణీ నిర్వహించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Sashirekha Lyrical Song : ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
Former IAS Pradeep Sharma : మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష