Kodandaram | ధరణిపై.. ప్రభుత్వాన్ని నిలదీయాలి: ప్రొ.కోదండరామ్
Kodandaram విధాత: భూ సంబంధిత సమస్యల పరిష్కారం, నిర్వహణ కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పేద వర్గాలకు, సమాజానికి ఉపయోగపడేది కాదని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఈ వ్యవస్థను తీసుకువచ్చిందని మండిపడ్డారు. ధరణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 1,50,000 కుటుంబాలు నష్టపోయాయని ఆరోపించారు. శనివారం స్థానిక ఫిలిం భవన్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో 'ధరణి ఓ చీడ- పీడ' అనే అంశంపై న్యాయవాది కొరివి […]

Kodandaram
విధాత: భూ సంబంధిత సమస్యల పరిష్కారం, నిర్వహణ కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పేద వర్గాలకు, సమాజానికి ఉపయోగపడేది కాదని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఈ వ్యవస్థను తీసుకువచ్చిందని మండిపడ్డారు.
ధరణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 1,50,000 కుటుంబాలు నష్టపోయాయని ఆరోపించారు. శనివారం స్థానిక ఫిలిం భవన్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ‘ధరణి ఓ చీడ- పీడ’ అనే అంశంపై న్యాయవాది కొరివి వేణుగోపాల్ అధ్యక్షతన అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ధరణి పోర్టల్ పై రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేస్తున్న సామాజికవేత్త సాదిక్ అలీ తోపాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు, న్యాయవాదులు, సామాజిక ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కనుమరుగైన భూస్వామ్య సంస్కృతిని పునరుద్ధరించడం, గతంలో కోల్పోయిన భూములు మళ్లీ భూస్వాముల దరి చేర్చడం లక్ష్యంగానే ప్రభుత్వం ఈ పోర్టల్ తీసుకువచ్చిందని వారు మండిపడ్డారు.
రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉత్తరాది రైతులు ఢిల్లీ వేదికగా చేసిన ఉద్యమాన్ని రాష్ట్ర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని, ధరణి పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని, అందుకు ఉద్యమాల పోరుగడ్డ కరీంనగర్ నుండి నాంది పలకాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలోని నాలుగు కోట్ల మంది రైతులు ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ధరణి పోర్టల్ ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా, ఆర్ ఓ ఆర్ చట్టంలో పేర్కొన్న నిర్ణీత పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో, రైతులు, భూ యజమానులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ధరణి పోర్టల్ సమస్యలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ నియమించినప్పటికీ,
మార్పులు, చేర్పుల విషయంలో అసాధారణ జాప్యం జరుగుతుందన్నారు.
భూమికి సంబంధించి క్రయ, విక్రయాల సందర్భాల్లో ఆర్ ఓ ఆర్1971 సెక్షన్ ఆరు బి, ఆరు సి
ప్రకారం రైతులు రుణాలు తీసుకోవాలంటే పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలని భూ యజమానులపై ఒత్తిడి ఉందన్నారు. భూమి బదలాయింపు తర్వాత తమ భూములను మ్యుటేషన్ చేయించుకోవడం, పాసుబుక్కులు, టైటిల్ డీల్స్ ఇచ్చి రుణాలు తీసుకోవడంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కోదండరాం ఏమన్నారంటే..
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ధరణి సమస్యలపై నిర్మాణాత్మకమైన ఉద్యమం రావాల్సి ఉందని అన్నారు. గతంలో అనుభవ రాహిత్యం ఉన్న సంస్థలకు ఇంటర్ ప్రశ్నాపత్రాల తయారీ, మూల్యాంకన బాధ్యతలు అప్పచెప్పినట్టే, ధరణి విషయంలోనూ ప్రభుత్వం
అదే ధోరణి అవలంభించిందన్నారు.
ధరణి పోర్టల్ రూపకర్తలు ఎవరో ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోర్టల్ రూపకల్పనలోనే అనేక తప్పులు దొర్లాయని ఆయన చెప్పారు. ధరణి కారణంగా రైతులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయారని ఆరోపించారు. తాసిల్దార్ల నుండి మొదలు కలెక్టర్ల వరకు
రైతుల అభ్యంతరాలు తమకు సరి చేసే అధికారం లేదు అంటుంటే.. దీన్ని సరి చేయాల్సింది ఎవరని సూటిగా ప్రశ్నించారు.
ధరణిలో జరిగిన అన్యాయాలకు సంబంధించి ఇప్పటివరకు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధరణి బాధలు భరించలేక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, జగిత్యాల జిల్లా
లలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు రైతులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణి కారణంగా రైతులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి సమస్యలకు సంబంధించి కంప్యూటర్లకు ఎప్పుడు తాళమే ఉంటుందన్నారు. పలుకుబడి ఉన్నవారు, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నవారు ఒత్తిడి తెస్తేనే అవి తెరుచుకుంటున్నాయని, ఆ తర్వాత యథాస్థితికి చేరుకుంటున్నానని చెప్పారు.
ధరణి వైఫల్యాలపై హైకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించిందని, ఈనెల 15 నాటికి రైతుల నుండి వచ్చిన భూముల ఆర్జీలకు పరిష్కారం చూపాలని ఆదేశించిందని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలన్నారు.
గ్రామాలకు రావాల్సిందే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు ఉత్సవాలు, చెరువుల పండగలు ఊరూరా నిర్వహిస్తున్న ప్రభుత్వం ధరణి సమస్యలను కూడా, గ్రామాలకి వచ్చి అక్కడే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో మన భూములు, మనకు చెందకపోతే ఆ బాధ్యత స్థానిక శాసనసభ్యులదే! అని అన్నారు.
కాంట్రాక్టులు, ఇసుక దందాలు కాదు మా గురించి కూడా ఆలోచించాలని రైతులు వారిని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ధరణి కారణంగా నష్టపోయిన రైతులు సంబంధిత కాగితాలు దగ్గర పెట్టుకుని నిలదీయడానికి సిద్ధం కావాలని, అందుకు ఇదే సరైన సమయం అని అన్నారు.
భూమి మనది.. కష్టం మనది..
ధరణి కాగితాలతో సిద్ధంగా ఉండండి… నిలబడండి.. నిలదీయండి.. మీ వెంటే మేముంటాం అని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిర్బంధం, కేసుల విషయంలో రైతులు భయపడాల్సిన అవసరం లేదని, వారికి ఉచిత న్యాయసహాయం అందించేందుకు, అండగా నిలిచేందుకు న్యాయవాదులు, సామాజికవేత్తలు, విపక్ష నేతలు సిద్ధంగా ఉంటారని భరోసా ఇచ్చారు.