మంత్రి పదవి వస్తుంది.. భువనగిరి టికెట్ మేం కోరలేదు

తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు

  • By: Somu    latest    Mar 23, 2024 10:49 AM IST
మంత్రి పదవి వస్తుంది.. భువనగిరి టికెట్ మేం కోరలేదు
  • కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


విధాత, హైదరాబాద్‌ : తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ టికెట్‌ తన భార్య లక్ష్మికి ఇవ్వాలని కోరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. టికెట్ కోసం కనీసం దరఖాస్తు కూడా చేయలేదని తేల్చేశారు.


భువనగిరి ఎంపీ టికెట్‌ బీసీకి ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తారనేది తన తన అభిప్రాయమని, ఇదే విషయాన్ని అధిష్ఠానికి తెలియజేశానన్నారు. అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. సర్వేలో ఒకవేళ కోమటిరెడ్డి లక్ష్మి గెలుస్తుందని వస్తే, తప్పక పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, అది నిజం కాదని, కోమటిరెడ్డి బ్రాండ్ అని ఆయన స్పష్టం చేశారు.