Konda Surekha-Murali | మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

Konda Surekha-Murali |  మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

నటరాజన్ కు 16పేజీల లేఖ
ఆరోపణలపై వివరణ

విధాత, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ-మురళి దంపతులు గురువారం హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు..తమపై వచ్చిన ఆరోపణలపై 16పేజీల లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని..బీసీ కార్డుతోనే బతుకుతున్నానని.. పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తారన్నారు. పనిచేసే వారిపైనే కొందరు రాళ్లు వేస్తారన్నారు. నడిచే ఎద్దునే పొడుస్తారని వ్యాఖ్యానించారు. 44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ కొనసాగుతూనే ఉందని..తనకు తానుగా ఎవరిమీదా కామెంట్ చేయనని.. నా మీద చేస్తే ఊరుకోను అని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని.. ప్రజా బలంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. నాకు భయపడకపోతే నాపై 23 కేసులు పెట్టకపోయేవాళ్లు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం.రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం అని తెలిపారు. రేవంత్‌రెడ్డిని ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రిగా చూడాలని.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అండగా నిలుస్తామని..అందుకు పార్టీ మా సేవల్ని వినియోగించుకోవాలన్నారు. శుక్రవారం జరగబోయే ఖర్గే సభపై చర్చించామని.. వరంగల్ నుంచి ఎంత మంది వస్తారనే అంశంపై మాట్లాడమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తానని.. ఎమ్మెల్యేలను మళ్లీ వరంగల్‌లో గెలిపించడమే నా బాధ్యత అన్నారు. ఎలాంటి గ్రూపు రాజకీయాలతో నాకు సంబంధం లేదని..పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌తో చెప్పానన్నారు. పరకాల నుంచి పోటీ చేస్తానన్న నా కూతురు సుస్మిత ప్రకటన నాకు తెలియదన్నారు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయకపోవచ్చని మురళి తెలిపారు. కుటుంబంలో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయన్నారు. ఆమె ఆలోచన ఏమిటో నాకు తెలియదన్నారు.

సుస్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేం: కొండా సురేఖ
మంత్రిగా తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘నిబంధనల ప్రకారమే పని చేస్తున్నానని.. నా శాఖలో ఉన్న ఫైల్స్‌ అన్నీ పరిశీలించుకోవచ్చు అని తెలిపారు. మంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. మాపై వచ్చిన ఆరోపణపై క్రమశిక్షణా సంఘం ముందు మురళి వివరణ ఇచ్చారని..మీనాక్షి నటరాజన్ తో చర్చించామని తెలిపారు. వివాదం క్రమశిక్షణ సంఘం ముందు ఉండగా..మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని..నాయిని రాజేందర్ రెడ్డి బొంగెం కాదు అని మాట్లాడిన మాటలను నటరాజన్ కు తెలిపామన్నారు. నా కూతురు సుస్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం అని.. ఆమెకు మా ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదన్నారు. సుస్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమని.. భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం ఆమెకు ఉందన్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం.’’ అని కొండా సురేఖ అన్నారు.