రెండు భాగాలుగా ఎన్టీఆర్ దేవర.. దర్శకుడు కొరటాల ప్రకటన

  • By: Somu    latest    Oct 04, 2023 12:02 PM IST
రెండు భాగాలుగా ఎన్టీఆర్ దేవర.. దర్శకుడు కొరటాల ప్రకటన
  • అమాంతంగా పెరిగిన అంచనాలు
  • మొదటి పార్ట్ ఏప్రిల్ 5న విడుదల


విధాత: యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమాలో రెండు భాగాలు రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. మొదటి పార్ట్ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు.


అందరూ ఊహించినట్టు దేవర ఒక్క భాగం కాదని, సీక్వెల్ కూడా ఉండబోతోందన్నారు. దానికి కారణాలు వివరించిన కొరటాల ఇంత గొప్ప కథని రెండున్నర గంటల్లో చెప్పలేమని, ప్రతి పాత్ర, సన్నివేశం డిటైలింగ్ డిమాండ్ చేయడంతో అనిర్వచనీయమైన అనుభూతిని ఇవ్వడం కోసం కొనసాగింపు ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు అఫీషియల్ గా చెప్పారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాతా చాలా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు జంటగా తెలుగులోకి తొలిసారి ఈ చిత్రంతో జాన్వీకపూర్ ఎంట్రీ ఇస్తుండటంతో వారి జంటపైన కూడా సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అటు ఆచార్యతో భారీ డిజాస్టర్ చవిచూసిన కొరటాల శివ ఈ దఫా ఎలాగైన దేవరతో భారీ హిట్ కొట్టాలన్న కసితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


దేవర షూటింగ్‌కు సంబంధించి తాజాగా సముద్రం బ్యాక్ డ్రాప్‌గా సరికొత్త రీతిలో చిత్రీకరించిన పోరాటా సన్నివేశాల చిత్రాలు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దేవర రెండు భాగాలుగా రాబోతుందంటూ దర్శకుడు కొరటాల శివ వెల్లడించడంతో ఈ చిత్రం అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. దేవరలో తారక్ డ్యూయల్ రోల్ అని గతంలోనే లీక్ వచ్చింది. అంటే తండ్రి కొడుకుల షేడ్స్ ని విడివిడిగా చూసే ఛాన్స్ రావొచ్చు.


అయితే ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రెండు పాత్రలు యువకులుగానే కనిపిస్తాయని బాహుబలిలో ప్రభాస్ టైపు ట్రీట్ మెంట్ ఉంటుందని అంటున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర తప్పకుండా తెలుగు నుంచి మరో పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం తధ్యమన్న ధీమా ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నది.