Telangana | సీఎంగా కేటీఆర్‌.. డిప్యూటీ ఈటల? బీఆరెస్‌కు మెజార్టీ తగ్గితే బీజేపీయే దారి

Telangana | రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి! అప్పుడు బీజేపీ పొత్తుతో బీఆరెస్‌ సర్కార్‌ అదే జరిగితే కీలక పదవులు ఖాయం రాష్ట్ర బీజేపీ నేతల ‘కింగ్‌మేకర్‌’ ప్లాన్‌? నేతలు పార్టీని వీడకుండా ప్రయత్నాలు! కాంగ్రెస్‌ లేదా బీఆరెస్‌ మెజార్టీ సాధిస్తే? రెంటికీ చెడ్డ రేవడిలా మారటం ఖాయం! ఆందోళనలో బీజేపీ అసంతృప్త నేతలు విధాత‌ ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలానూ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో పోరు మొత్తం బీఆరెస్‌-కాంగ్రెస్‌ మధ్యే కేంద్రీకృతమయ్యేలా […]

  • By: krs    latest    Sep 04, 2023 3:07 AM IST
Telangana | సీఎంగా కేటీఆర్‌.. డిప్యూటీ ఈటల? బీఆరెస్‌కు మెజార్టీ తగ్గితే బీజేపీయే దారి

Telangana |

  • రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి!
  • అప్పుడు బీజేపీ పొత్తుతో బీఆరెస్‌ సర్కార్‌
  • అదే జరిగితే కీలక పదవులు ఖాయం
  • రాష్ట్ర బీజేపీ నేతల ‘కింగ్‌మేకర్‌’ ప్లాన్‌?
  • నేతలు పార్టీని వీడకుండా ప్రయత్నాలు!
  • కాంగ్రెస్‌ లేదా బీఆరెస్‌ మెజార్టీ సాధిస్తే?
  • రెంటికీ చెడ్డ రేవడిలా మారటం ఖాయం!
  • ఆందోళనలో బీజేపీ అసంతృప్త నేతలు

విధాత‌ ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలానూ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో పోరు మొత్తం బీఆరెస్‌-కాంగ్రెస్‌ మధ్యే కేంద్రీకృతమయ్యేలా పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో బీఆరెస్‌కు ఈసారి గెలుపు అంత సులువేమీ కాదన్న వాతావరణం కనిపిస్తున్నది. తాము కచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలో బీజేపీలోనే ఉండి సాధించేది ఏంటని కొందరు నాయకులు మథనపడుతున్నారని సమాచారం.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్‌లోకి వెళతారనే చర్చ చాలా రోజులుగానే సాగుతున్నది. ఈటల రాజేందర్‌ సైతం బీజేపీ అధికారంలోకి రావాలనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ.. పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవని వారికీ అర్థమవుతున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. మరికొందరు నేతల్లోనూ ఇదే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే కొందరు నాయకులు కాంగ్రెస్‌ గూటికి చేరే ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే.. వారిని పార్టీలోనే నిలుపుకొనే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం ఉన్నదని చెబుతున్నారు. సీట్లు, తగ్గినా లేదా హంగ్‌ ఏర్పడినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ మాత్రం అధికారంలోకి రాకుండా కేసీఆర్‌ పావులు కదుపుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ కదిలే పావులు తమవే అవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం కేసీఆర్‌ తమ పార్టీనే ఆశ్రయిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదే జరిగితే బీజేపీ కింగ్‌ మేకర్‌ అవుతుందని, కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఆ క్యాబినెట్‌లో ఈటల రాజేందర్‌ డిప్యూటీ సీఎంగా ఉంటారని బీజేపీ నాయకత్వం ఇద్దరు నాయకులకు నచ్చ జెబుతున్నారని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాజ్యసభకు పంపి.. అటు నుంచి కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోవాలనేది అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు.

రెండో దఫా పరిపాలన సాగిస్తున్న కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తున్నారు. అయితే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌, విప‌క్షం బ‌లోపేతం కావ‌డంతో ఫలితాల్లో ఏమన్నా తేడా వస్తే అది తమకు లాభిస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సర్వేలు కూడా బీఆరెస్‌కు తగినంత మెజార్టీ రాకపోవచ్చని అంటున్నాయని గుర్తు చేస్తున్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో 60కి పైగా స్థానాలు సాధిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. ఒకవేళ మెజార్టీ తగ్గినా.. లేక 45-50 సీట్ల మధ్య వచ్చినా బీజేపీ మద్దతుతో బీఆరెస్‌ గట్టెక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్ర‌కారం బీజేపీకి ఎన్ని సీట్లు వ‌చ్చినా… ఈ రెండు పార్టీల‌కు క‌లిపితే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు ఉంటాయ‌ని పేర్కొంటున్నారు.

మరి తేడా వస్తే?

బీజేపీ అధిష్ఠానం ఆలోచన పైకి బాగానే ఉన్నా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినా లేదా బీఆరెస్‌ పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకున్నా తమ పరిస్థితి ఏంటని పలువురు అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఇండియా కూటమి మోదీని గట్టిగా ఎదుర్కొని అధికారానికి దూరం చేస్తే అప్పుడు కేసీఆర్‌ కూడా ప్రతిపక్షాలతోనే చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు తమ నాయకులు రాష్ట్రంలో గానీ లేదా కేంద్రంలోగానీ రెంటికీ చెడ్డ రేవడిలా మారుతారేమో అనే ఆందోళన సదరు నేతల అనుచరులలో వ్యక్తమవుతున్నది.