జ‌న్వాడ ఫామ్‌హౌస్‌కు కేటీఆర్‌!

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖ‌ర్‌రావు త‌న అధికార నివాసం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను వీడారు

జ‌న్వాడ ఫామ్‌హౌస్‌కు కేటీఆర్‌!
  • ఇప్ప‌టికే ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన మాజీ ముఖ్య‌మంత్రి
  • బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లో ఖాళీగానే ఉన్న కేసీఆర్ ఇల్లు
  • డిశ్చార్జి అయితే కుమార్తె క‌విత ఇంటికి వెళ్ల‌నున్న కేసీఆర్‌?


విధాత‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖ‌ర్‌రావు త‌న అధికార నివాసం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను వీడారు. ఫలితాలు వెలువ‌డిన రోజైన‌ ఆదివారం సాయంత్రం త‌న రాజీనామా లేఖ‌ను సీఎంవో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ద్వారా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి కేసీఆర్ పంపించారు. ఆదివారం రాత్రి ఎంపీ సంతోష్ వాహ‌నంలో ఎలాంటి భ‌ద్ర‌త లేకుండా మెద‌క్ జిల్లా ఎర్ర‌వ‌ల్లిలోని త‌న ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.


అనంత‌రం కేసీఆర్ త‌న కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఇంటికి వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. బిడ్డ ఇంటి వ‌ద్ద నుంచే రాజ‌కీయ వ్య‌వ‌హారాలు జ‌రుపుతార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేశారు. ఇంత‌లోనే కేసీఆర్ బాత్ రూమ్‌లో ప్ర‌మాద‌శాత్తు కాలు జారి ప‌డ‌టం, ఎడ‌మ‌కాలి తొంటి విరిగడం జ‌రిగిపోయాయి. ద‌వాఖాన నుంచి డిశ్చార్జి అయ‌న త‌ర్వాత కేసీఆర్ బిడ్డ క‌విత ఇంటికివ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు రాజ‌కీయ ప‌రిశీలకులు భావిస్తున్నారు.


జన్వాడ ఫామ్‌హౌస్‌కు కేటీఆర్‌


హైద‌రాబాద్ న‌గ‌రానికి 30 కిలోమీట‌ర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని జ‌న్వాడ‌లో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫామ్‌హౌస్ ఉన్న‌ది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను వీడిన కేసీఆర్.. బిడ్డ క‌విత ఇంటికి వెళ్తే, అన్న కేటీఆర్ త‌న సొంత ఫామ్‌హౌస్‌కు వెళ్తార‌ని స‌మాచారం. కుటుంబ నివాస యోగ్యంగా అన్ని హంగులు, స‌క‌ల వ‌స‌తుల‌తో ఫామ్‌హౌస్‌ను గ‌తంలోనే నిర్మించిన‌ట్టు తెలిసింది. 2019 ఎలక్షన్ అఫిడవిట్‌లో కేటీఆర్ తన భార్య పేరు మీద జ‌న్వాడ‌లో వేర్వేరు సర్వే నంబర్ల లో 4 ఎకరాల 6 కుంటలు, 2 ఎకరాలు, 1 ఎకరం 20 కుంటలు, 18 కుంటలు ఉన్నట్లు పేర్కొన్నారు.


నందిన‌గ‌ర్‌లో ఖాళీగా సొంత నివాసం


బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్‌ 14 నందిన‌గ‌ర్‌లో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు సొంత నివాసం ఉన్న‌ది. రెండు అంత‌స్థుల భ‌వ‌నం అన్ని హంగుల‌తో గ‌తంలోనే నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ నివాసం ఖాళీగా ఉన్న‌ది. కొంద‌రు పోలీసులు మాత్రం అక్క‌డ కాప‌లా కాస్తున్నారు. అధికారంలోకి రావ‌డానికి ముందు కేసీఆర్ కుటుంబం నందిన‌గ‌ర్‌లో ఉన్న‌ఇంట్లోనే ఉన్న‌ది. ఈ ఇంటికి కూతవేటు దూరంలో కుమార్తె క‌విత ఉండేవార‌ని స‌మాచారం. క‌విత గ‌తంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు కొద్దిదూరంలోనే ప్ర‌స్తుతం బ్ర‌హ్మాండంగా, అత్యాధునిక హంగుల‌తో భారీ నివాసాన్ని నిర్మించుకున్నారు. ఈ నివాసంలోనే కేసీఆర్ ఉంటార‌ని స‌మాచారం.