Maha Shivaratri | మహా శివరాత్రి రోజున శివుడిని ఎలా అభిషేకించాలి?
శివుడు.. అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిందే.. మరి ఆ దేవదేవుడిని మహా శివరాత్రి పర్వదినాన ఎలా అభిషేకిస్తే సంతృప్తుడవుతాడోనని భక్తులందరిలో ఓ సందేహం ఉంటుంది

Maha Shivaratri | శివుడు.. అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిందే.. మరి ఆ దేవదేవుడిని మహా శివరాత్రి పర్వదినాన ఎలా అభిషేకిస్తే సంతృప్తుడవుతాడోనని భక్తులందరిలో ఓ సందేహం ఉంటుంది. మరి ఆదిదేవుడిని ఎలా అభిషేకించాలో తెలుసుకుందాం..!
మహా శివరాత్రి.. మాఘమాసంలో వచ్చే శివరాత్రినే మహాశివరాత్రి అంటారు. ఏడాదంతా శివుడిని స్మరించుకోకున్నా ఈ ఒక్క రోజు ‘ఓం నమశ్శివాయ’ అని మనసారా అనుకున్నా ఆ ముక్కంటి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి రోజున వేకువజాము నుంచి అర్ధరాత్రి దాకా… అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ఈరోజున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, తలస్నానం చేసి, ఉతికిన లేదంటే కొత్త బట్టలు ధరించి పూజగదిని శుభ్రం చేసుకుని.. గుమ్మాలకు తోరణాలను అలంకరించుకోవాలి.
లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధజలం, ఆవుపాలు, పంచామృతం, వివిధ పూజా ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా ఈరోజున మారేడు దళాలు, బిల్వ పత్రాలు, తుమ్మిపూలు, గోగుపూలు, తెలుపు రంగు పూలతో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ పూజించడం వల్ల.. శివానుగ్రహం కలుగుతుంది. శివునికి నైవేద్యంగా తాంబూలం, చిలకడదుంప (కందగడ్డ), అరటిపండు, జామపండు, ఖర్జూరపండ్లను సమర్పించి.. శివ అష్టోత్తర పారాయణం చేయాలి.
ప్రాతఃకాలం నుంచి ఉదయం 9 గంటలలోపు శివపూజ , శివునికి అభిషేకాలు చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆ లయకారుడిని మనసునిండా భక్తితో నీటితో అభిషేకించినా పొంగిపోతాడు. అందుకే ఆయనను భోళాశంకరుడని అంటారు. చతుర్దశి అర్ధరాతి 12 గంటలకు లింగోద్భవ సమయంలో శివనామస్మరణ చేస్తూ శివునికి అభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని పండితులు అంటుంటారు.