Yadadri | అంబులెన్స్‌కు కాల్.. ఎమర్జెన్సీ అంటూ లిఫ్ట్ కోరిన మందుబాబు
108 అంబులెన్స్.. ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడటం దాని విధి.

Yadadri | యాదాద్రి భువనగిరి : 108 అంబులెన్స్.. ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడటం దాని విధి. ఇక ఎవరైనా 108కి కాల్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వారి దగ్గర వాలిపోతోంది. అయితే ఓ వ్యక్తి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తాను అపస్మారకస్థితిలో ఉన్నానని చెప్పి 108కి కాల్ చేశాడు. దీంతో అంబులెన్స్ అతని వద్దకు చేరుకుంది. అతను చెప్పిన సమాధానం విని అంబులెన్స్ సిబ్బంది కంగు తిన్నారు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కే రమేశ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి జనగామకు కాలినడకన బయల్దేరాడు. 40 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత భువనగిరికి సమీపంలో ఆగిపోయాడు. ఇక మద్యం మత్తులో ఉన్న అతను తాను అపస్మారకస్థితిలోకి వెళ్లానని 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు.
అంబులెన్స్ అతని వద్దకు క్షణాల్లో చేరుకుంది. ఏమైందని రమేశ్‌ను అంబులెన్స్ సిబ్బంది ప్రశ్నించగా, అలసిపోయాను.. నడవడం కష్టంగా ఉంది. కాళ్లు నొప్పులు వస్తున్నాయి. కాస్త జనగామలో తనను వదిలిపెట్టండి అని వారిని రమేశ్ కోరాడు. ఎమర్జెన్సీ అంటే ఏంటని రమేశ్‌ను ప్రశ్నించారు. అన్‌కాన్సియస్ అంటే ఎమర్జెన్సీ కదా అని రమేశ్ బదులిచ్చాడు.
మా అత్తగారి ఇల్లు జనగామ.. అక్కడికి వెళ్లాలి. బస్సులు కూడా లేవు. అంబులెన్స్‌లో అక్కడ వదిలిపెట్టండి అని సిబ్బందిని కోరాడు. కాళ్ల నొప్పులు, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే భువనగిరి ఆస్పత్రిలో వదిలిపెడుతాం.. డాక్టర్లు చూశాక పొద్దున్నే పంపిస్తారని అంబులెన్స్ సిబ్బంది చెప్పగా, తనను జనగామలోనే వదిలిపెట్టాలని మొండిగా మాట్లాడాడు రమేశ్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.